ముషీరాబాద్, వెలుగు: రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఉండాలని సంపాదకులు సతీష్ చందర్ పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్టు కొంగర మహేష్
అనువదించిన రాజ్యాధికార వీలునామా పుస్తక ఆవిష్కరణ సభ గురువారం రాత్రి కవి, రచయిత పసునూరి రవీందర్ అధ్యక్షతన బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.
దీనికి ముఖ్య అతిథులుగా సతీష్ చందర్ తో పాటు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, బుచ్చన్న, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కాసీం, తెలంగాణ ఆర్టీఐ కమిషనర్ దేశాల భూపాల్, రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ భరత్ భూషణ్, రచయిత్రి జూపాక సుభద్ర, ప్రొఫెసర్ మాలిక్, ప్రొఫెసర్ బాలబోయిన సుదర్శన్ హాజరయ్యారు.
సతీష్ చందర్ మాట్లాడుతూ కాన్షీరాం రాజకీయాలు సజీవమైనవని, రెండు తెలుగు రాష్ట్రాల్లో వాటిని బతికించుకొని బహుజన రాజ్యాన్ని సాధించుకోవాలన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసీం మాట్లాడుతూ కాన్షీరాం ఏం చెప్పారో అదే చేశారని ఆయన పోరాటం అర్థం చేసుకోవాలంటే రాజ్యాధికార వీలునామా చదవాలన్నారు.
రచయిత్రి జూపాక సుభద్ర మాట్లాడుతూ అనేక అంశాలను రాజ్యాధికార వీలునామా పుస్తకంలో అనువాదం చేశారని, ఈ పుస్తకం చదివితే దేశ రాజకీయాలతో పాటు కాన్సీరామ్ పోరాటం తెలుస్తుందన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ మాట్లాడుతూ రాజ్యాన్ని ఎవరూ ఎవరికి ఉచితంగా ఇవ్వరని, ఇప్పటి వరకు దాన్ని పొందిన వారు శక్తి యుక్తులతోనే సాధించుకున్నారని తెలిపారు.
అడుక్కుంటే బిక్షం, ఆహారం, దుస్తులు లభిస్తాయేమో... కానీ రాజ్యం దక్కదని రాజ్యాధికారం దిశగా సాగాలంటే రాజ్యాధికార వీలునామా పుస్తకం చదవాల్సిందేనని స్పష్టం చేశారు. జర్నలిస్ట్ బుచ్చన్న మాట్లాడుతూ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతనే దేశంలో విప్లవాలు వచ్చాయని, మార్పు దిశగా వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జంగిలి దర్శన్ పాల్గొన్నారు.
