- ‘సత్తాయీస్ కా సంకల్ప్’ పేరుతో ఎస్పీ మేనిఫెస్టో
- పల్లెల్లో 300 యూనిట్ల ఫ్రీ కరెంట్.. సాగుకు ఉచిత విద్యుత్
- ఎస్పీ మేనిఫెస్టోను రిలీజ్ చేసిన అఖిలేశ్ యాద్
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మేనిఫెస్టో విడుదల చేసింది. ఉద్యోగాలు, రైతు సంక్షేమం, అందుబాటులో వైద్యం, సామాజిక న్యాయమే ప్రధానాంశాలుగా ‘జన్–మన్ కా మేనిఫెస్టో’ పేరుతో, ‘సత్తాయీస్ కా సంకల్ప్: పీడీఏ కా ప్రాణ్పత్ర్’ (2027 సంకల్పం: పీడీఏ ప్రతిజ్ఞాపత్రం) నినాదంతో 28 పేజీల మేనిఫెస్టోను పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రాజ్యాంగ దినోత్సవమైన గురువారం విడుదల చేశారు. ఉపాధి, విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, మహిళా అభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక వసతులు, శాంతిభద్రతలు సహా 21 అంశాలపై హామీలు ఇచ్చారు.
25 లక్షల ఉద్యోగాలు.. రూ.5 వేల భృతి
ఐదేండ్లలో 25 లక్షల సర్కారు ఉద్యోగాలు ఇస్తామని, ఇతర రంగాల్లో మరో 2 నుంచి 3 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చింది. ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తామని, అప్పటిదాకా నెలకు రూ.5 వేల భృతి ఇస్తామని ప్రకటించింది. ఎంఎస్ఎంఈ రంగాన్ని అభివృద్ధి చేసి 2032 నాటికి కోటికి పైగా ఉద్యోగాలు సృష్టిస్తామని తెలిపింది. 23 పంటలతో పాటు పాలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ గ్యారంటీ ఇస్తామని, రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఎస్పీ ప్రకటించింది. రూ.15 వేల కోట్ల కార్పస్ ఫండ్‌తో చెరుకు రైతులకు 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తామని చెప్పింది. సాగుకు ఉచిత విద్యుత్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని ప్రకటించింది.
మళ్లీ ల్యాప్‌టాప్‌లు.. పేదలకు రూ.10 లక్షల బీమా
ప్రస్తుత ప్రభుత్వం మూసేసిందని ఎస్పీ చెబుతున్న 26 వేల ప్రైమరీ స్కూళ్లను తిరిగి తెరుస్తామని, ఇంటర్ పాసైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీని మళ్లీ ప్రారంభిస్తామని, అన్ని బడుల్లో వైఫై ఏర్పాటు చేస్తామని, జీఎస్డీపీలో 6 శాతం విద్యపై ఖర్చు చేస్తామని హామీ ఇచ్చింది. దారిద్ర్యరేఖకు దిగువనున్న వారికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామి చెప్పింది. బడ్జెట్లో 20 శాతం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేస్తామని, రూ.50 కోట్ల వరకు విలువైన ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 50 శాతం దళితులు, పీడీఏ వర్గాలకు రిజర్వ్ చేస్తామని, బ్యాక్లాగ్ పోస్టులను ప్రత్యేక డ్రైవ్‌తో భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. నేరాలపై జీరో టాలరెన్స్ పాటిస్తామని, మహిళలపై నేరాల నివారణకు డీజీపీ కింద గ్రామస్థాయి దాకా ప్రత్యేక మహిళా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, పోలీస్ నియామకాల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చింది.
- రూ.5కే భోజనం.. ‘దామ్ బాంధో’
దేశవ్యాప్తంగా పీడీఏ వర్గాలు, మహిళలు, పేదల కోసం ‘సమాజ్‌వాదీ క్యాంటీన్లు’ తెరిచి రూ.5కే భోజనం పెడతామని, కార్మికులకూ రూ.5 భోజనం అందిస్తామని ప్రకటించింది. వృద్ధ మహిళా చేతివృత్తి కళాకారులకు, నిర్మాణ రంగంలో పనిచేసే వృద్ధులకు ఏటా రూ.40 వేల పెన్షన్, నిర్మాణ కార్మికులకు రూ.10 లక్షల బీమా ఇస్తామని తెలిపింది. పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా ‘దామ్ బాంధో’ (ధరలు కట్టడి) విధానాన్ని మళ్లీ తెస్తామని చెప్పింది.
