- కడుపునొప్పితో దవాఖానకు వస్తే బయటపడ్డ అసలు విషయం
- విజయవంతంగా తొలగించిన వైద్య బృందం
పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో 17 ఏండ్ల బాలుడి కడుపులో డాక్టర్లు గర్భసంచిని గుర్తించి, శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. పరిగిలోని ఛత్రాజీ మల్టీస్పెషాలిటీ దవాఖాన వైద్యుడు డాక్టర్ రాజేందర్ కథనం ప్రకారం.. ఓ బాలుడు కొన్ని నెలలుగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు.
ఎన్ని దవాఖానలకు తిరిగినా నొప్పి తగ్గకపోవడంతో కొద్ది రోజుల క్రితం ఛత్రాజీ హాస్పిటల్కు తీసుకువచ్చారు. డాక్టర్లు స్కానింగ్ తీసి హెర్నియా లేదా హైడ్రోసిల్ అయి ఉండవచ్చని భావించి ఆపరేషన్ ప్రారంభించారు.
శస్త్రచికిత్స చేస్తుండగా కడుపులో గర్భాశయంతో పాటు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల ఆనవాళ్లు కనిపించడంతో డాక్టర్లు ఆశ్చర్యపోయారు. వెంటనే సర్జన్ కృష్ణ పర్యవేక్షణలో వాటిని తొలగించి బయాప్సీ పరీక్షలకు పంపారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఎందుకిలా జరుగుతుంది?
వైద్య శాస్త్రం ప్రకారం ‘పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్’ అనే అత్యంత అరుదైన జన్యుపరమైన లోపం వల్ల ఇలా జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. తల్లి గర్భంలో పిండం ఎదుగుతున్న ప్రారంభ దశలో ఆడ, మగ ఇద్దరిలోనూ ‘ముల్లెరియన్ డక్ట్స్’ అనే కణజాలం ఉంటుంది. సాధారణంగా మగ శిశువులలో యాంటీ-ముల్లెరియన్ హార్మోన్ విడుదలై, ఈ కణజాలాన్ని కరిగించి వేస్తుంది.
ఆడ శిశువుల్లో మాత్రం ఇవి గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్గా అభివృద్ధి చెందుతాయి. మగ శిశువులలో జన్యుపరమైన లోపం వల్ల ఈ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోతే, ఆ కణజాలం కరిగిపోకుండా కడుపు లోపల గర్భాశయంగా మారుతుంది.
ఇలాంటి వారికి క్రోమోజోములు, బాహ్య జననాంగాలు సాధారణ పురుషుల లాగే ఉంటాయి. అందువల్ల కడుపునొప్పి, హెర్నియా లేదా వృషణాలు కిందకు దిగకపోవడం వంటి సమస్యలతో ఆపరేషన్ చేసినప్పుడు మాత్రమే ఈ అరుదైన లోపం బయటపడుతుంది.
