ఆమనగల్లు/ జడ్చర్ల, వెలుగు: ప్రభుత్వం నుంచి విడుదలైన పరిహారం డబ్బు కోసం భార్య తన లవర్‌తో కలిసి కట్టుకున్నవాడిని హత్య చేయించిన ఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ మండలం అవుర్పల్లి సమీపంలోని చిన్ననెమలిగుట్టపై జరిగింది. సీఐ వేణుగోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కు చెందిన మల్లికార్జున్(20) ఇల్లు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురయ్యింది.
దీంతో ఆర్ అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ఇటీవల రూ.18 లక్షలు పరిహారం విడుదలయ్యింది. కాగా, మల్లికార్జున్, అంజమ్మ దంపతులు గతంలో ఓ చోట మాడ్గుల్ మండలం అవుర్‌పల్లికి చెందిన బన్నీ శివ కలిసి పని చేసేవారు. అక్కడ అంజమ్మతో శివకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో వచ్చిన పరిహారం డబ్బులు కాజేసి కలిసి జీవించాలని, ఇందులో భాగంగా భర్త మల్లికార్జున్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఈ నెల 20న శివ మల్లికార్జున్‌తో కలిసి జడ్చర్లలో మద్యం తాగారు. అనంతరం బైక్‌పై అవుర్పల్లి శివారులోని గుట్ట వద్దకు వచ్చి మరింత మద్యం సేవించారు.
మత్తులో ఉన్న మల్లికార్జున్‌ను బండరాయితో హత్యచేసి మృతదేహాన్ని పొదల్లో పడేశాడు. అనంతరం ఫోన్, బైక్ తీసుకుని వెళ్లిపోయాడు. 23వ తేదీన గుట్టపై మృతదేహం గుర్తించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాల్ లిస్ట్ ఆధారంగా గురువారం అంజమ్మ, శివలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
మరోఘటనలో.. అడ్డుగా ఉన్నాడని..ములుగు జిల్లాలో భర్త హత్య
వెంకటాపురం, వెలుగు: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని సున్నం బట్టివీధికి చెందిన పూనెం నాగేశ్వరరావు (35), బీసీ మర్రిగూడెం కాలనీకి చెందిన నాగజ్యోతితో 12 ఏళ్ల కింద లవ్‌మ్యారేజ్ జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం వారు కమ్మరిగూడెం రహదారిలోని డబుల్బెడ్రూమ్ ఇంట్లో నివాసం ఉంటున్నారు.
కాగా, బెస్తగూడెం గ్రామానికి చెందిన గుండారపు సత్యంతో జ్యోతికి మూడు ఏళ్ల కింద పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న నాగరాజు పలుమార్లు భార్యను హెచ్చరించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఇద్దరూ కలిసి నాగరాజు హత్యకు కుట్రపన్నారు. అందులో భాగంగానే బుధవారం రాత్రి సత్యం, మరికొందరి సహకారంతో జ్యోతి భర్తను హత్య చేసింది. అనంతరం తన భర్తకు ఫిట్స్వచ్చి అపస్మారక స్థితిలో ఉన్నాడని 108కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు.
అయితే నాగేశ్వరరావు మృతిపై అనుమానం వ్యక్తం చేసిన ఆయన అన్న పూనెం వెంకట నరసింహారావు గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి మృతదేహంపై బలమైన గాయాలు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లు ఎస్సై కొప్పుల తిరుపతిరావు తెలిపారు. నాగజ్యోతి, సత్యంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు.
