గృహిణి అవయవ దానం.. ఏడుగురికి పునర్జన్మ

గృహిణి అవయవ దానం.. ఏడుగురికి పునర్జన్మ
  • బైక్ స్కిడ్ అయి ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన ఇబ్రహీంపట్నం మహిళ 
  • గ్రీన్ కారిడార్ ద్వారా 3 గంటల 46 నిమిషాల్లో చెన్నైకి గుండె తరలింపు 

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన గృహిణి హనుమంతు లక్ష్మి (50) అవయవదానంతో ఏడుగురు రోగులకు కొత్త జీవితం లభించింది. ఈ నెల 22న కుమారుడితో కలిసి టూవీలర్ పై వెళ్తుండగా ఇబ్రహీంపట్నం వెలిమినేడు వద్ద వాహనం అకస్మాత్తుగా స్కిడ్ అయి కిందపడింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే హైదరాబాద్ లోని ఓ స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా, అత్యవసర చికిత్స అనంతరం 25న డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. దీంతో ఆమె భర్త హనుమంతు నర్సింహ అవయవదానానికి నిర్ణయం తీసుకోవడంతో రెండు కిడ్నీలు, ఒక లివర్, ఒక గుండె, ఊపిరితిత్తులు, రెండు కార్నియాలు కలిపి మొత్తం ఏడు అవయవాలను డాక్టర్లు సేకరించారు. 

గ్రీన్ కారిడార్ ద్వారా చెన్నైకి గుండె..

మన రాష్ట్రంలో సోట్టో పరిధిలో తగిన గ్రహీతలు అందుబాటులో లేకపోవడంతో గుండెను రీజినల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంట్ ఆర్గనైజేషన్(రోట్టో)–సౌత్ పరిధిలోని చెన్నై ఎంజీఎం హాస్పిటల్ కు గ్రీన్ కారిడార్ ద్వారా 3 గంటల 46 నిమిషాల్లో తరలించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 187 బ్రెయిన్ డెడ్ దానాలు జరగ్గా ఇది 188వ అవయవదానమని, మానవత్వానికి నిదర్శనంగా నిలిచి ఇతరులకు స్ఫూర్తినిచ్చిన లక్ష్మి కుటుంబానికి సోట్టో తెలంగాణ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజ్  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.