డిసెంబర్ 14న ఢిల్లీలో బీసీల జనభేరి : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల

డిసెంబర్ 14న  ఢిల్లీలో బీసీల జనభేరి : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల ప్రకటన
  • జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చకపోతే  బీజేపీని గద్దె దింపుతామని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: వచ్చే జనవరి నుంచి దేశవ్యాప్తంగా జరగనున్న జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చి బీసీ కులాల లెక్కలు తేల్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్  గౌడ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణనను కేంద్ర ప్రభుత్వం నిర్వహించకపోతే దేశంలోని 80 కోట్ల మంది బీసీలు ఏకమై జాతీయ జనగణనను బహిష్కరించాలనే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీసీ సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో చేపట్టనున్న బీసీల జనభేరి కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను జాజుల, ఏపీ అధ్యక్షుడు కేశన శంకర్ రావు విడుదల చేశారు. 

ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ ఓబీసీ కాలమ్ చేర్చాలని ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా బీసీలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న మోదీ.. బీసీలకు న్యాయం చేయాలని ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. బీసీల ఓట్లతో గెలిచిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఓబీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 14న రామ్‌లీలా మైదానంలో జరగనున్న బీసీల జనభేరికి దేశంలోని 29 రాష్ట్రాల నుంచి బీసీ సంఘాల నేతలు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యామ్ కుర్మ తదితరులు పాల్గొన్నారు.