- మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ
- వేలం నోటిఫికేషన్‌పై పిల్స్ విచారణ వాయిదా
హైదరాబాద్, వెలుగు: కూకట్‌పల్లిలోని హుడా ట్రక్ పార్కింగ్ స్థలం వేలం వ్యవహారంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్) విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మూసాపేట పరిధిలోని 315 ఎకరాల భూమిని ఈ నెల 27న వేలం వేసేందుకు కలెక్టర్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సామాజిక కార్యకర్త మాధవరం కాంతారావు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు బి. మయూర్‌రెడ్డి, గండ్ర మోహన్‌రావు, బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. ట్రక్ టెర్మినల్ ఏర్పాటు కోసం ప్రజాప్రయోజనార్థం సేకరించిన భూమిని ఇప్పుడు వేలం వేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర ప్రజాప్రయోజనాలకు వినియోగిస్తామన్న కారణంతో భూమి విక్రయానికి అనుమతించరాదన్నారు. ఆ స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మళ్లించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. షాపింగ్ మాల్ నిర్మాణానికి కూడా మార్కింగ్ చేశారని చెప్పారు. భవిష్యత్తు అవసరాలపై అధ్యయనం చేయకుండా వేలం నిర్వహించడం సరికాదన్నారు. ఇప్పటికే వేలం కోసం రూ.5 కోట్ల ఈఎండీ వసూలు చేశారని, ఈ నెల 27న నిర్వహించనున్న వేలాన్ని నిలిపివేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాజకీయ ఉద్దేశాలతో దాఖలైన ఈ పిటిషన్లు విచారణార్హం కావని పేర్కొన్నారు.
2005లో ట్రక్ సబ్ టెర్మినల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదన్నారు. భూసేకరణ జరిగిన సమయంలో నగర శివార్లలో ఉన్న ఆ ప్రాంతం ప్రస్తుతం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిందని వివరించారు. భూమి విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజాప్రయోజనాలకే ఖర్చు చేస్తామని తెలిపారు. గతంలో ట్రక్ యజమానుల సంఘం ఇదే అంశంపై దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. నగరం విస్తరించిన నేపథ్యంలో ట్రక్కుల పార్కింగ్ కోసం పటాన్చెరు, బాటసింగారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మంగళంపల్లిలో ప్రత్యామ్నాయ స్థలాలు ఉన్నాయని కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించలేదు. తదుపరి విచారణను వాయిదా వేసింది.
