పద్మారావు నగర్, వెలుగు: శబరిమల అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల నుంచి కొల్లాం మధ్య 14 అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు గురువారం ప్రకటించింది. భక్తులు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ కోరారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
హైదరాబాద్ - కొల్లాం (07187) డిసెంబర్ 4, 18 తేదీల్లో (శుక్రవారం) ఉదయం 9 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. కొల్లాం - కాజీపేట (07188) తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 5, 19 తేదీల్లో (శనివారం) రాత్రి 7.30 గంటలకు బయలుదేరి, సోమవారం ఉదయం 7 గంటలకు కాజీపేట చేరుతుంది. సిర్పూర్ కాగజ్నగర్ - కొల్లాం (07171) డిసెంబర్ 11, 25 తేదీల్లో (శుక్రవారం) వేకువజామున 4 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. కొల్లాం - హైదరాబాద్ దక్కన్ (07172) డిసెంబర్ 12, 26 తేదీల్లో (శనివారం) రాత్రి 7.30 గంటలకు బయలుదేరి, సోమవారం వేకువజామున 4 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ దక్కన్ - కొల్లాం (07173) జనవరి 1, 8, 15 తేదీల్లో (శుక్రవారం) ఉదయం 9 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. కొల్లాం - హైదరాబాద్ దక్కన్ (07174) జనవరి 2, 9, 16 తేదీల్లో (శనివారం) రాత్రి 7.30 గంటలకు బయలుదేరి, సోమవారం వేకువజామున 4 గంటలకు హైదరాబాద్ దక్కన్ చేరుకుంటుంది.
ఆగే ప్రధాన స్టేషన్లు ఇవే..
ఈ ప్రత్యేక రైళ్లన్నీ వికారాబాద్, తాండూర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు, కాట్పాడి, సేలం, ఈరోడ్, పాలక్కాడ్, త్రిశూర్, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగన్నూర్ తదితర స్టేషన్లలో ఆగుతాయి. వీటితో పాటు సిర్పూర్ కాగజ్నగర్ నుంచి నడిచే రైలుకు బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లలోనూ హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
