రైతులకు గుడ్ న్యూస్: ప్రత్యామ్నాయ పంటల  సాగుకు భారీ సబ్సిడీలు! 

రైతులకు గుడ్ న్యూస్: ప్రత్యామ్నాయ పంటల  సాగుకు భారీ సబ్సిడీలు! 
  •     వ్యవసాయశాఖ ప్రతిపాదనలు
  •     డ్రిప్ పరికరాలు, మల్చింగ్‌ షీట్లు, వ్యవసాయ సామగ్రిపై ప్రోత్సాహకాలు
  •     50  నుంచి 100 శాతం వరకు సబ్సిడీ ఇచ్చేలా ప్లాన్​


 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. రైతులు వరి సాగుపైనే ఆధారపడకుండా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఇతర వాణిజ్య పంటల వైపు మళ్లేలా ప్రోత్సాహకాలు అందించాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు, మల్చింగ్‌ షీట్లు, ఇతర వ్యవసాయ సామగ్రిపై భారీగా సబ్సిడీలు ఇచ్చే ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నది. ఆయా పరికరాలు, ఇన్‌పుట్స్‌ను బట్టి 50 నుంచి 100 శాతం వరకు రాయితీలు కల్పించేందుకు ప్రతిపాధనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను పరిశీలన కోసం ప్రభుత్వానికి అందించింది. ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తున్నది.

ఆరుతడి పంటలకు ప్రోత్సాహం

రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లలో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నది. దీంతో భూగర్భజలాల వినియోగం, సాగునీటి అవసరాలు పెరగడంతో పాటు ధాన్యం సేకరణ, నిల్వలు, మార్కెటింగ్‌ పరంగాను ప్రభుత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. మరోవైపు వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం అనిశ్చితి నేపథ్యంలో నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఈ పరిస్థితుల్లో కందులు, పెసర్లు, మినుములు, శనగలు వంటి పప్పుధాన్యాలతో పాటు వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల సాగును పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడంతో పాటు సాగు ఖర్చు తగ్గించేలా ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదిస్తున్నది.

సాగు ఖర్చు తగ్గించేలా రాయితీలు

ప్రత్యామ్నాయ పంటల సాగులో రైతులకు ఎదురయ్యే ప్రధాన సమస్యలను దృష్టిలో పెట్టుకొని సబ్సిడీల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నాణ్యమైన విత్తనాల పంపిణీకి ప్రత్యేక రాయితీలు కల్పించడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గించే డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నది. కలుపు నివారణ, నేలలో తేమ సంరక్షణ, పంట ఎదుగుదలకు ఉపయోగపడే మల్చింగ్‌ షీట్లపైనా సబ్సిడీలు ఇవ్వాలని భావిస్తున్నది. అవసరమైన వ్యవసాయ పనిముట్లు, ఇతర సామగ్రి రాయితీపై అందించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఆయా పరికరాల స్వభావం, రైతులకు కలిగే ప్రయోజనం, సాగు విస్తీర్ణం ఆధారంగా 50 నుంచి 100 శాతం వరకు సబ్సిడీ కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 

సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమలుకు సన్నాహాలు

ప్రత్యామ్నాయ పంటల సాగును కేవలం అవగాహన కార్యక్రమాలకే పరిమితం చేయకుండా రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించాలని వ్యవసాయ శాఖ భావిస్తున్నది. సబ్సిడీల ద్వారా పెట్టుబడి భారం తగ్గితే రైతులు కొత్త పంటల సాగుకు ముందుకొస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. సబ్సిడీల శాతం, అర్హుల ఎంపిక, పంపిణీ విధానం, అమలు మార్గదర్శకాలపై స్పష్టత రావాల్సి ఉంది.