- బీమా సంస్థలకు అంబుడ్స్‌మన్ సూచన
హైదరాబాద్, వెలుగు: పాలసీదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని బీమా సంస్థలకు ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ జి. శోభా రెడ్డి సూచించారు. ఐఆర్‌డీఏఐ నిర్వహిస్తున్న ఫిర్యాదుల పరిష్కార మాసంలో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని కత్రియా హోటల్‌లో ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2047 నాటికి అందరికీ బీమా అందించాలంటే ప్రజల్లో నమ్మకం పెరగాలని, అందుకు సంస్థలు ఫిర్యాదులను మొదటి దశలోనే పరిష్కరించాలని అన్నారు.
అంబుడ్స్‌మన్ కార్యాలయంలో రూ.50 లక్షల వరకు క్లెయిమ్‌లకు సంబంధించిన వివాదాలను ఉచితంగా పరిష్కరిస్తారని తెలిపారు. ముఖ్య అతిథి బెజోన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం తగ్గించి, పాలసీదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఎల్‌ఐసీ జోనల్ ఇన్‌చార్జ్ శరవణ రమేష్, మాజీ అంబుడ్స్‌మన్ సి. వికాస్ రావు కూడా మాట్లాడారు. ఫిర్యాదులను www.cioins.co.inలో నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
