వాడ వాడలా రాజ్యాంగ పండుగ ..అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఫొటో ప్రదర్శన, రాజ్యాంగంపై అవగాహన

వాడ వాడలా రాజ్యాంగ పండుగ ..అంబేద్కర్ విద్యాసంస్థల్లో  ఫొటో ప్రదర్శన, రాజ్యాంగంపై  అవగాహన
  • కదం తొక్కిన ప్రజా, కార్మిక, కుల సంఘాలు  
  •  పలుచోట్ల రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలు  

హైదరాబాద్ సిటీ, వెలుగు :  ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ, రాజ్యాంగ పరిరక్షణే పరమావధిగా గురువారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ట్యాంక్‌‌బండ్‌‌పై ముఖ్యమంత్రి నేతృత్వంలో సాగిన చారిత్రాత్మక పాదయాత్ర నగరానికి కొత్త ఉత్సాహాన్నివ్వగా, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం వివిధ ప్రజా, కార్మిక, కుల సంఘాలు కదం తొక్కాయి. 

బాగ్‌‌లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఫొటో ప్రదర్శన, రాజ్యాంగ అవగాహన కార్యక్రమం, నెక్లెస్ రోడ్‌‌లో మాలలు, మాల ఉపకులాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన  ఉత్సవ శోభను తెచ్చాయి. బషీర్‌‌బాగ్‌‌లోని బాబు జగ్జీవన్‌‌రామ్ విగ్రహం నుంచి ట్యాంక్‌‌బండ్‌‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు సీపీఐ ఆధ్వర్యంలో సాగిన 'రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ', అంబేద్కర్ విగ్ర హం వద్ద ఐ.ఎన్.టి.యు.సి ప్రదర్శనతో నగర వీధులన్నీ నీలిరంగు జెండాలు, నినాదాలతో హోరెత్తాయి.

అంబేద్కర్ విద్యాసంస్థల్లో..

ముషీరాబాద్ : బాగ్ లింగంపల్లి లోని అంబేడ్కర్ విద్యాసంస్థల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఫొటో ప్రదర్శన,  రాజ్యాంగ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్​లర్​ప్రొఫెసర్ కృష్ణ దేవరావు హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం మాత్రమే కాదని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే సజీవ సాధనమని పేర్కొన్నారు. 

అంబేడ్కర్ విద్యాసంస్థల కార్యదర్శి, బెల్లంపల్లి ఎమ్మెల్యే జి. వినోద్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కులు, విధులపై అవగాహన కలిగి ఉండేలా రాజ్యాంగ విద్యను విస్తృతంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. 

అంతకుముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అడిషనల్​డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ మాట్లాడారు. కాలేజీ జాయింట్ సెక్రటరీ పి.వి.రమణ కుమార్, లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సృజన, చీఫ్​అడ్మినిస్ట్రేటివ్​ఆఫీసర్​ఎన్. కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

మాల సంఘాల జేఏసీ ర్యాలీ

ట్యాంక్ బండ్  : మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ నేతృతంలో రాజ్యాంగాన్ని రక్షించుకుందాం రోస్టర్ విధానాన్ని సవరించుకుందామనే అనే నినాదంతో నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ఇందిరా గాంధీ విగ్రహం మీదుగా125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు మాల, మాల ఉపకులాలు భారీ ర్యాలీ చేపట్టాయి. 

అంబేద్కర్ విగ్రహం వద్ద మందాల భాస్కర్, గ్రేటర్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్, మాల స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు, ఓయూ హంస చైర్మన్ నామా సైదులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్పందించి మాలలకు న్యాయం చేయాలని , లేకపోతే  20 లక్షల మంది మాలలతో హైదరాబాద్ ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. రాజ్యాంగ రక్షణ దళ్ చైర్మన్ రాజేశ్, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, మాల విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
 
రాజ్యాంగాన్ని అవమానించిన వారే మాట్లాడుతున్నారు: లక్ష్మణ్

అబిడ్స్ : అబిడ్స్‌‌లోని మెథడిస్ట్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ దివస్ వేడుకల్లో లోక్‌‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ , ఇఫ్లూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగలపల్లి నాగరాజుతో కలిసి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రధాని పిలుపు మేరకు రాజ్యాంగ గౌరవ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, రాజ్యాంగ విలువలు, అమలులోకి వచ్చిన నాటి నుంచి సాగిన ప్రస్థానాన్ని జెన్‌‌జీ యువతకు వివరించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. కాంగ్రెస్ అంబేద్కర్‌‌ను అడుగడుగునా అవమానించిందని విమర్శించారు. గతంలో రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తులే నేడు రాజ్యాంగాన్ని చేతబట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.