- నిందితుడు మద్యం మత్తులో ఫోన్ చేసినట్టు గుర్తింపు..
- మూడు రోజుల జైలు శిక్ష..రూ. 500 జరిమానా వేసిన కోర్టు
కీసర,వెలుగు : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో డయల్-100కు ఫోన్ చేసి ఒక చోట హత్య జరుగుతోందని తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఓ యువకుడికి కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధించింది. అలాగే, రూ.500 జరిమానా కూడా విధించింది.
ఈనెల 24వ తేదీన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చీర్యాలకు చెందిన కొమ్ముల వెంకటేష్ డయల్-100కు ఫోన్ చేసి ‘నేను చెప్పేది జాగ్రత్తగా వినండి...ఒకచోట హత్య జరుగుతోంది. వెంటనే వెళ్తే కాపాడొచ్చు’ అని పెట్టేశాడు. వెంటనే స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు పెట్రోలింగ్ పార్టీతో పాటు, బ్లూకోల్ట్స్ సిబ్బందిని అక్కడికి పంపారు.
స్టేషన్పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు మూడు గంటల పాటు చుట్టుపక్కల అంతా గాలించారు. అయితే, అక్కడ ఎలాంటి హత్య జరగలేదని నిర్ధారించుకుని వెళ్లిపోయారు. తర్వాత కాల్ చేసింది ఎవరా అని విచారించగా చీర్యాలకు చెందిన వెంకటేశ్మద్యం తాగి పోలీసులను ఆటపట్టించడానికి ఇలా చేశాడని గుర్తించారు.
హత్య జరుగుతోందని తెలిస్తే పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలని కాల్చేశాడని తెలుసుకున్నారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి బుధవారం స్పెషల్ మార్నింగ్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దీంతో కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి మూడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
