- నిరంత విద్యుత్ అందించేందుకు ఏర్పాట్లు
- పారిశ్రామికవేత్తలతో భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణను ప్రధాన హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 2029 నాటికి రాష్ట్రంలో 5 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. గురువారం ప్రజాభవన్‌లో డేటా సెంటర్ల నిర్వాహకులు, గ్రీన్ ఎనర్జీ రంగ ప్రతినిధులతో భట్టి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలువురు పారిశ్రామికవేత్తలు వర్చువల్‌గా ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, విద్యుత్ అవసరాలు, పరిశ్రమల విస్తరణపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. ఏఐ విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లకు ప్రాధాన్యం పెరిగిందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి హైదరాబాద్ అత్యంత అనుకూలమని తెలిపారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల మానవ వనరులతో పాటు హైదరాబాద్ వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటం డేటా సెంటర్ల నిర్వహణకు ఎంతో కలిసొచ్చే అంశమని వివరించారు.
నిరంతర విద్యుత్ సరఫరా చేస్తాం
పరిశ్రమలకు ఎలాంటి విద్యుత్ కొరత లేకుండా నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంధన, ఐటీ, పరిశ్రమల శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు నడుస్తుండగా, మరో 2 గిగావాట్ల సామర్థ్యం గల కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను కొనసాగిస్తూనే, పెట్టుబడిదారులకు మరింత అనుకూల వాతావరణం, భద్రత కల్పిస్తున్నామనిస్పష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే వారిని సంపద సృష్టికర్తలుగా, రాష్ట్ర అతిథులుగా గౌరవిస్తామని పేర్కొన్నారు. ఈ సమీక్షలో విద్యుత్ శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
