ఎమ్మెల్యే అనంత్ సింగ్ అంటే ఇప్పుడు దాదాపు తెలియని వాళ్లుండకపోవచ్చు. ఒక్క పెళ్లితో అంత ఫేమ్ సంపాదించారు ఈ బీహార్ ఎమ్మెల్యే. తన కూతురు పెళ్లికి ఆకాశమంత పందిరేసి.. భూదేవంత అరుగులేసి.. అన్నట్లుగా అంగరంగ వైభవంగా విందు ఏర్పాటు చేశారు. గుర్రపు పోటీలు, విజయం సాధించిన వారికి థార్ కారు బహుమతి, కార్యకర్తల కోసం ప్రత్యేక వంటశాలలు, అతిథుల కోసం హెలీప్యాడ్ లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవలి కాలంలో ఇంత హంగామా ఎవరూ చేసి ఉండరు. దాదాపు 10 లక్షల మేర జనాలకు భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ వాహ్వా అనుకుంటున్నారు.. అయితే ఈ హంగామాలో ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
బిహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ తన కారు డ్రైవర్ ను కాలితో తన్నినట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి ఎక్స్ లో వైరల్ అయింది. తన కుమార్తె వివాహ వేడుకల్లో ఆయన ఎస్ యూవీ సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి అతిథులకు అభివాదం చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
పాట్నా జిల్లా నద్వాన్ గ్రామంలో2026 నవంబర్ 25న అనంత్ సింగ్ కుమార్తె శివాంగి సింగ్ వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. వేల సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. ఒక కారు సన్ రూఫ్ నుంచి అనంత్ సింగ్ బయటకు వచ్చి అక్కడ ఉన్న జనానికి అభివాదం చేస్తూ కనిపించారు.
వీడియోలో ఎమ్మెల్యే జనానికి అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా కోపంతో కారు లోపల ఉన్న డ్రైవర్ ను కాలితో తన్నినట్లు కనిపిస్తోంది. డ్రైవర్ ను తన్నిన తర్వాత కూడా ఆయన ఏమీ జరగనట్లుగా జనానికి అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
నవంబర్ 25న జరిగిన ఈ వివాహ వేడుకల్లో గుర్రపు పందాలు, లగ్జరీ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకల కోసం భారీగా భోజన ఏర్పాట్లు చేశారు. అనంత్ సింగ్ ను స్థానికులు ఛోటే సర్కార్ అని పిలుస్తుంటారు. ఈయన బిహార్ లోని మొకామా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ వివాహానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.
Anant Singh kicked his driver while the car was moving. https://t.co/Y4FQ7Sympx
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 26, 2026
