యారాండ్ల పోరు ఎంతకూ ఒడువదు.. అని అంటుంటారు. వాళ్ల పోరు పడలేక అన్నదమ్ములు విడిపోవడం చాలా వరకు చూస్తుంటాం. భార్యలకు చెప్పుకోలేక.. కుటుంబాన్ని సంతృప్తిపర్చలేక.. చివరికి వేరు కాపురం పెట్టే పరిస్థితులు ఉంటుంటాయి. కానీ ఈ భర్తలు భార్యల పోరు భరించలేక ఏకంగా చేయరాని తప్పు చేశారు. ఇద్దరినీ చంపిన అన్నదమ్ములు వారిని ఒకే చోట పూడ్చిపెట్టడం సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలో ఇద్దరు సోదరులు తమ భార్యలను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్యల మధ్య చాలా కాలంగా జరుగుతున్న గొడవలే ఈ హత్యలకు కారణమని గుమ్లా ఎస్పీ హరిస్ బిన్ జమా వెల్లడించారు.
అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శివ శంకర్ సాహు, అతని సోదరుడు నవీన్ సాహు సోమవారం తమ భార్యలు మినీ ప్రియ (28), రాధిక కుమారి (20)లను చంపినట్లు పోలీసులు చెప్పారు. హత్య చేసిన తర్వాత మృతదేహాలను అంబులెన్స్‌లో పొరుగు జిల్లా అయిన సిమ్‌డేగాలోని అడవికి తీసుకెళ్లి పాతిపెట్టినట్లు ఎస్పీ తెలిపారు.
తమ భార్యల మధ్య గొడవలు ఉండటంతో విసిగిపోయి ఈ పని చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. అయితే హత్యకు రెండు రోజుల ముందే ఆ ఇద్దరు మహిళలు రాజీ పడ్డారని పోలీసులు వెల్లడించారు. 2026 నవంబర్ 24 (మంగళవారం) తమ భార్యలు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లారని నిందితులు పోలీసులకు చెప్పారు. అయితే పోలీసుల విచారణలో వారు నిజాన్ని ఒప్పుకున్నారని ఎస్పీ హరిస్ బిన్ జమా పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.
నిందితుల సమాచారంతో పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని, మృతదేహాలను తరలించిన అంబులెన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుల తల్లిదండ్రులు సామేశ్వర్ సాహు, తిలేశ్వరి దేవిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు బాధితుల కుటుంబ సభ్యులు వారితో ఫోన్లో మాట్లాడారని, అప్పటివరకు అంతా సాధారణంగానే ఉందని ఎస్పీ చెప్పారు.
