సిరాజ్, జడేజా లేకపోయినా ఈ జట్టుపైనే నమ్మకం.. సునీల్ గవాస్కర్ బోల్డ్ రియాక్షన్

సిరాజ్, జడేజా లేకపోయినా ఈ జట్టుపైనే నమ్మకం..  సునీల్ గవాస్కర్ బోల్డ్ రియాక్షన్

Sunil Gavaskar: న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)తో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను తుది జట్టు నుంచి తప్పించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టు ఎంపికపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా, ఒకసారి తుది జట్టును ప్రకటించాక దానికి పూర్తి మద్దతు ఇవ్వాలని సన్నీ సూచించారు. అయితే, పిచ్ 4, 5వ రోజుల్లో స్పిన్‌కు అనుకూలించే ఛాన్స్ ఉన్నందున జడేజాను పక్కన పెట్టడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.

అది మీ జట్టు, నా జట్టు.. టీమిండియాకు అండగా నిలవాలి: గవాస్కర్

ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో 11 టెస్టుల్లో 43 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సిరాజ్ ఉన్నాడు. అయినప్పటికీ అతడిని పక్కన పెట్టడంతో, 2020లో టెస్ట్ అరంగేట్రం చేసిన తర్వాత సిరాజ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ముగిసిన తొలి విదేశీ సిరీస్ ఇదే కావడం గమనార్హం. దీనిపై సునీల్ గవాస్కర్ ఇలా స్పందించారు. ఈ సైకిల్‌లో సిరాజ్ టాప్ వికెట్ టేకర్, కానీ ఏం జరుగుతుందో వేచి చూద్దాం.. తుది 11, 14 లేదా 16 మంది సభ్యుల జట్టుపై మీకు ఎలాంటి రిజర్వేషన్లు ఉన్నా.. ఒకసారి జట్టు ఎంపికయ్యాక అది మీ జట్టు, నా జట్టు. అన్నింటికంటే ముఖ్యంగా అది భారత జట్టు.. కాబట్టి నేను ఈ జట్టుకు మద్దతు ఇస్తున్నాను, బాగా ఆడాలని ప్రార్థిస్తున్నానని సన్నీ భాయ్ పేర్కొన్నాడు. 

రవీంద్ర జడేజాను తప్పించడంపై గవాస్కర్ అసంతృప్తి: 

అందరూ సిరాజ్ గురించే మాట్లాడుతున్నారని, కానీ జడేజాను పక్కన పెట్టడం కూడా పెద్ద నిర్ణయమేనని సునీల్ గవాస్కర్ గుర్తుచేశారు. మనం కేవలం సిరాజ్ గురించే మాట్లాడుతున్నాం, మరి జడేజా సంగతేంటి? ఈ WTC సైకిల్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ అతడు. నాలుగు, ఐదో రోజుల్లో అతడి స్పిన్ చాలా ఉపయోగపడేదని నేను బలంగా నమ్ముతున్నాను.. నెమ్మదైన పిచ్‌లపై కూడా బంతిని గ్రిప్ చేసి తిప్పగల సత్తా జడేజాకు ఉంది. సిరాజ్‌తో పాటు జడేజాకు కూడా ఇది దురదృష్టకరం అని గవాస్కర్ వెల్లడించాడు. 

ALSO READ : ఇది అన్యాయం.. సిరాజ్‌కు చోటివ్వకపోవడంపై కైఫ్, హర్షా భోగ్లే అసంతృప్తి

తొలి రోజు సత్తా చాటిన భారత యువ పేసర్లు: 

విమర్శల నడుమ బరిలోకి దిగిన భారత యువ పేస్ దళం తొలి రోజు ఆటలో అద్భుతంగా రాణించి టీమిండియాను పైచేయిలో నిలిపింది.  మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం తర్వాత, లంచ్ విరామానికి ముందు చివరి బంతికి అరంగేట్ర పేసర్ గుర్నూర్ బ్రార్ డెవాన్ కాన్వేను ఔట్ చేసి తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులో పాతుకుపోయిన టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్‌లను ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్ పెవిలియన్‌కు పంపారు. రచిన్ రవీంద్రను కూడా ఆకాశ్ దీప్ ఔట్ చేయడంతో, తొలి రోజు టీ విరామానికి న్యూజిలాండ్ 190/5 పరుగులతో కష్టాల్లో పడింది.