హైదరాబాద్: అర్ధరాత్రి కురిసిన వర్షంతో సున్నం చెరువు జలకళను సంతరించుకుంది. పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు నేరుగా చెరువులోకి చేరడంతో చెరువు నీటితో కళకళలాడుతోంది. వర్షపు నీరు చెరువులోకి సులభంగా చేరేలా హైడ్రా అధికారులు ఇన్‌లెట్లను అభివృద్ధి చేయడంతో ఈ మార్పు సాధ్యమైంది.
గతంలో ఆక్రమణల కారణంగా సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సున్నం చెరువు కేవలం 14 ఎకరాలకు కుంచించుకుపోయింది. అంతేకాకుండా చెరువు మురికికూపంగా మారి దుర్వాసన వెదజల్లేది. ఈ పరిస్థితిని గుర్తించిన హైడ్రా ఆక్రమణలను తొలగించి చెరువును పునరుద్ధరించింది. హైడ్రా చర్యలతో ప్రస్తుతం చెరువు విస్తీర్ణం తిరిగి 32 ఎకరాలకు చేరింది. చెరువును సుందరీకరించడంతో పాటు వర్షపు నీరు నేరుగా చేరేలా ఇన్‌లెట్లను అభివృద్ధి చేశారు.
తాజాగా కురిసిన వర్షానికి పరిసర ప్రాంతాల నుంచి నీరు చెరువులోకి చేరడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి వర్షపు నీరు చేరిన దృశ్యాలను ఫొటోలు, వీడియోల రూపంలో చిత్రీకరించి హైడ్రాకు పంపించారు. చెరువు పునరుజ్జీవం పొందడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ : నవంబర్ 27న యథావిధిగా మూసాపేట లేఅవుట్ ఈ–వేలం
ఇదిలా ఉండగా, సున్నం చెరువు అభివృద్ధి పనులు పూర్తికావడంతో డిసెంబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెరువును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు మురికికూపంగా ఉన్న చెరువు ఇప్పుడు వర్షపు నీటితో కళకళలాడుతుండటంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
