జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో అగ్నిప్రమాదాల మిస్టరీ.. కీలక ఫైళ్లు బూడిదేనా?

జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో అగ్నిప్రమాదాల మిస్టరీ.. కీలక ఫైళ్లు బూడిదేనా?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, ట్యాక్స్, అకౌంట్స్, రెవెన్యూ విభాగాలకు చెందిన కీలక రికార్డులు అగ్నికి ఆహుతి అవుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రమాదాలు యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? లేక కీలక రికార్డులు మాయమయ్యేలా ఏమైనా కుట్ర జరుగుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తాజాగా ఈరోజు ఉదయం ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెండో అంతస్తులోని ఫైనాన్షియల్ సెక్షన్‌లో, కీలక రికార్డులు, చెక్కులు భద్రపరిచే గదిలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి రికార్డులు దెబ్బతిన్నాయి? ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు సురక్షితంగా ఉన్నాయా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో అగ్నిప్రమాదాలు కొత్తేమీ కాదు. ప్రతిసారీ ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణమని అంచనా వేస్తున్నప్పటికీ, కీలక విభాగాల్లోనే మంటలు చెలరేగుతుండటంపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 2025 నవంబర్ 13న కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ట్యాక్స్ రిటర్నులు, టౌన్ ప్లానింగ్ రికార్డులు పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం. అంతకుముందు 2025 మే 5న మొఘల్‌పురా టౌన్ ప్లానింగ్ వింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఇదే భవనంలో రెండేళ్ల వ్యవధిలో నాలుగుసార్లు అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం మరింత చర్చనీయాంశమైంది.

గతంలోనూ కీలక రికార్డులు దగ్ధం

2023 మే 11న మొఘల్‌పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన రికార్డులు దగ్ధమయ్యాయి. 2018 ఫిబ్రవరి 6న ఖైరతాబాద్ జోన్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో అకౌంట్స్, ఆడిట్ విభాగాలకు చెందిన కీలక ఫైళ్లు కాలిపోయాయి. అప్పటి నివేదికల ప్రకారం 295 పెండింగ్ రన్నింగ్ బిల్లులకు సంబంధించిన రికార్డులు దగ్ధమయ్యాయి. అంతేకాకుండా తొమ్మిది కంప్యూటర్లు, మూడు ప్రింటర్లు, స్కానర్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.

2022 జనవరి 12న సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలోని మూడో అంతస్తులో ఉన్న ట్యాక్స్ సెక్షన్‌లో మంటలు చెలరేగాయి. ఇలా వేర్వేరు సంవత్సరాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో కీలక విభాగాల్లోనే అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం చర్చకు దారితీస్తోంది.

అక్రమ నిర్మాణాల ఫైళ్లు ఉన్నాయా?

ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో పలు కీలక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, భవన నిర్మాణ అనుమతులు, భూవివాదాలు, పన్నుల బకాయిలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లు ఏమైనా ఈ ప్రమాదాల్లో కాలిపోయాయా? ఏయే రికార్డులు పూర్తిగా దెబ్బతిన్నాయి? వాటికి డిజిటల్ బ్యాకప్ ఉందా? అన్నది తేలాల్సి ఉంది.

గత అగ్నిప్రమాదాలపై విచారణలు జరిగాయా? వాటి నివేదికలను అధికారులు బయటపెట్టారా? ప్రమాదాలు జరిగిన సమయంలో కార్యాలయాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారా? విద్యుత్ వ్యవస్థలో లోపాలు గుర్తించారా? గుర్తించిన లోపాలపై చర్యలు తీసుకున్నారా? అనే అంశాలపై స్పష్టత అవసరం.


జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఫైర్ సేఫ్టీపై గతంలోనే హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా సమగ్ర చర్యలు చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నగరంలోని అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, విద్యుత్ వైరింగ్‌ను తనిఖీ చేయాలని, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.