విదేశీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. వాట్సాప్‌లోనే ట్రావెల్ eSIM కొనుక్కోవచ్చు!

విదేశీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. వాట్సాప్‌లోనే ట్రావెల్ eSIM కొనుక్కోవచ్చు!

ఫారెన్ వెళ్లినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే లోకల్ సిమ్ కార్డుల కోసం వెతకడం లేదా ఫ్రీ వైఫై కోసం కేఫ్‌ల చుట్టూ తిరగడం ప్రయాణికులకు పెద్ద తలనొప్పిగా ఉంటుంది. ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఈ సమస్యలకు చెక్ పెడుతూ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ సరికొత్త బిజినెస్ విభాగంలోకి అడుగుపెడుతోంది. ఇకపై యాప్ నుంచే నేరుగా అంతర్జాతీయ ప్రయాణాల కోసం 'ట్రావెల్ eSIM' డేటా ప్లాన్‌లను కొనుగోలు చేసి, ఇన్‌స్టాల్ చేసుకునే సదుపాయాన్ని తీసుకురానుంది.

ఒకే యాప్‌లో సమస్త సేవలు:
ప్రస్తుతం బోర్డింగ్ పాస్‌ల దగ్గరి నుంచి ఎయిర్‌పోర్ట్ పికప్ సమాచారం వరకు ప్రయాణికులు వాట్సాప్‌నే ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు ఇందులోనే eSIM సేవలను జతచేయడం ద్వారా వాట్సాప్ తన వ్యాపార పరిధిని విస్తరించుకుంటోంది. కేవలం కొన్ని ట్యాప్‌లతో యాప్ విడిచి బయటకు వెళ్లకుండానే డేటా ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న మరో అద్భుతమైన విషయం ఏమిటంటే.. మీరు ట్రావెల్ eSIM డేటాను వాడుతూనే, మీ పాత ఫోన్ నంబర్‌తో ఉన్న వాట్సాప్‌ను సాఫీగా ఉపయోగించుకోవచ్చు.

ఈ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందించడానికి వాట్సాప్ పలు టెలికాం దిగ్గజాలతో చేతులు కలిపింది. భారత్ నుంచి రిలయన్స్ జియో.. అలాగే వెరిజోన్, స్మార్ట్ యాక్సియాటా, స్మార్ట్ కమ్యూనికేషన్స్ వంటి సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాట్సాప్ పనిచేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతోనే eSIM ప్రయోగాన్ని మొదలుపెట్టామని వాట్సాప్ హెడ్ కునాల్ షా వెల్లడించారు. 

ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?
ఈ ఫీచర్ త్వరలోనే ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో దశలవారీగా అందుబాటులోకి రానుంది. అయితే మొదట ఏ దేశాల్లో ప్రారంభిస్తారు, భారతీయ యూజర్లకు ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయంపై వాట్సాప్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఏదేమైనా.. వాట్సాప్ తీసుకొస్తున్న ఈ కొత్త eSIM బిజినెస్ మోడల్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్‌కు ఒక గొప్ప వరంగా మారనుంది. ట్రావెల్ సమయంలో కమ్యూనికేషన్ కష్టాల నుంచి విముక్తి తీసుకురానుంది.