దేశంలో క్రెడిట్ కార్డుల లావాదేవీలు మొదటిసారి ఏటీఎం క్యాష్ విత్ డ్రాయల్స్ కంటే పెరిగాయి. అక్టోబర్ 2026లో ప్రజలు క్రెడిట్ కార్డుల ద్వారా రూ.2లక్షల 45వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ క్రమంలో ఏటీఎం విత్ డ్రాయల్స్ రూ.2లక్షల 34వేల కోట్లుగా నమోదయ్యాయి. క్రెడిట్ కార్డుల వాడకం నగదు విత్ డ్రాయల్స్ కంటే రూ.10 వేల 765 కోట్లు ఎక్కువగా నమోదైంది. 2019 నవంబర్ నుంచి మొదటిసారి ఈ స్థాయిలో మార్పు కనిపించాయి.
డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గు
రోజువారీ కొనుగోళ్లకు క్యాష్, డెబిట్ కార్డుల కంటే యూపీఐ వాడకం పెరిగిందని బ్యాంక్ బజార్ సీఈఓ అదిల్ శెట్టి చెప్పారు. భారతీయులకు డిజిటల్ చెల్లింపులే ఇప్పుడు రెగ్యులర్ ఛాయిస్‌గా మారినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ నెలలో యూపీఐ లావాదేవీలు రూ.31 లక్షల 53వేల కోట్లకు చేరాయి. మొబైల్ యాప్ ఆధారిత చెల్లింపులు కూడా సెప్టెంబర్ లో ఉన్న రూ.39లక్షల 78వేల కోట్ల నుంచి అక్టోబర్ నాటికి రూ.43లక్షల 19వేల కోట్లకు పెరిగాయి.
పండగ సీజన్ లో పెరిగిన ఖర్చులు
పండగ సీజన్ కారణంగా అక్టోబర్ నెలలో క్రెడిట్ కార్డుల వినియోగం సెప్టెంబర్‌తో పోలిస్తే 20 శాతం పెరిగిందని అదిల్ శెట్టి పేర్కొన్నారు. 30 నుంచి 45 రోజుల వరకు వడ్డీ లేని కాలపరిమితి ఉండటం.. ఈఎంఐ సౌకర్యాలు ప్రజలను వీటిని వాడేందుకు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అయితే క్రెడిట్ కార్డు పరిమితిని అదనపు ఆదాయంలా భావించవద్దని కార్డ్ యూజర్లకు సూచించారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోతే నెలకు 4 శాతం వరకు వడ్డీ పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
వినియోగదారుల అలవాట్లు మారుతున్నాయని, ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇది నిదర్శనమని మిడాక్స్ సీఈఓ ఆకాశ్ బన్సల్ తెలిపారు. అయితే క్రెడిట్ కార్డుల వాడకంతో పాటు పొదుపు చేయడం, ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం ముఖ్యమని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే అక్టోబర్‌లో ఏటీఎం క్యాష్ విత్‌డ్రాలు సుమారు 7 శాతం తగ్గాయి. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యల వల్ల క్యాష్ వాడకం ఇంకా కొనసాగుతోందని అదిల్ శెట్టి చెప్పారు.
