ఒకవైపు ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదంతో కూడిన వినూత్నమైన కథ.. మరోవైపు మైథాలజీ, మిస్టరీ, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే ఉత్కంఠభరితమైన కథనం! డిసెంబర్ 4న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీకి రంగం సిద్ధమైంది. నితిన్ నటించిన ‘అలియాస్ రుక్మిణీ’, నాగచైతన్య నటించిన ‘వృషకర్మ’ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల ట్రైలర్లు విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ‘అలియాస్ రుక్మిణీ’ ట్రైలర్ చూస్తుంటే నితిన్ ఈసారి రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఓ కొత్త తరహా కథతో ప్రేక్షకులను పలకరించబోతున్నట్లు అర్థమవుతోంది. ఇంతకీ ఈ ట్రైలర్‌లో ఏముంది? నితిన్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు?
‘అలియాస్ రుక్మిణీ’.. నితిన్ కొత్త ప్రయత్నం!
నితిన్ హీరోగా, మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’. ‘దండోరా’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మురళీకాంత్ ఈసారి ఓ విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందించారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో ఆయన సోదరి దీప్తి గంటా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆఫియా సయ్యద్ కథానాయికగా నటిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో నితిన్ కృష్ణ అనే యువకుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఫ్యామిలీ కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేసే కృష్ణకు కొన్ని విచిత్రమైన కలలు వస్తుంటాయి. మరోవైపు అతడికి రచనా వ్యాసంగం కూడా ఉంటుంది. అయితే అతడు రాసే కథలకు ‘రుక్మిణీ’ అనే పేరును కలం పేరుగా ఉపయోగిస్తుంటాడు. ఈ రెండు భిన్నమైన జీవితాల మధ్య కృష్ణ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అతడి వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిణామాలేంటి? అన్నది ఆసక్తికరంగా చూపించారు.
రుక్మిణి పేరుతో రొమాంటిక్ నవలలు..
ట్రైలర్‌లో ప్రధానంగా ఆకట్టుకునే అంశం కృష్ణ రహస్య రచనా జీవితం. బయటకు సాధారణ ఉద్యోగిగా కనిపించే అతడు.. మరోవైపు రుక్మిణి అనే పేరుతో రొమాంటిక్, శృంగార కథలు రాస్తుంటాడు. ఈ విషయం తనకు పెళ్లి సంబంధం చూసే సమయంలో ఎలాంటి సమస్యలకు దారితీసింది? ఆఫియా సయ్యద్‌తో అతడి పరిచయం, ప్రేమ, పెళ్లి తర్వాత ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి? అనే అంశాల చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా తన రచనల గురించి నిజాన్ని దాచిపెట్టే క్రమంలో కృష్ణ ఎదుర్కొనే పరిస్థితులు, భార్యాభర్తల మధ్య వచ్చే అపార్థాలు, భావోద్వేగాలను వినోదాత్మకంగా చూపించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కొన్ని సన్నివేశాలు నవ్విస్తూనే, మరికొన్ని ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అయితే కృష్ణ రుక్మిణిగా మారడం వెనుక అసలు కారణమేంటి? అతడి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలకు ముగింపు ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తిని మాత్రం ట్రైలర్ కొనసాగించింది.
నితిన్‌కు బౌన్స్‌బ్యాక్ ఇచ్చే కథ అవుతుందా?
గత కొంతకాలంగా నితిన్‌కు ఆశించిన విజయాలు దక్కడం లేదు. దీంతో ఈసారి రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా వెళ్లి, కథా బలమున్న చిత్రాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. కృష్ణ పాత్రలో నితిన్ లుక్, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా కామెడీ, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు కలగలిసిన పాత్రలో ఆయన నటన ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
దర్శకుడు మురళీకాంత్ కథను ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. విజయ్ బుల్గానిన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. జోమోన్ టీ. జాన్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు మంచి ఫీల్ తీసుకొచ్చేలా ఉంది. మొత్తంగా ట్రైలర్‌తోనే కథపై ఓ అంచనాను క్రియేట్ చేయడంలో చిత్రబృందం సక్సెస్ అయింది. అయితే పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథనం ఉంటుందా? అన్నది థియేటర్లలో చూడాలి.
ALSO READ : ‘భోగి’ రిజల్ట్ ఇలా ఉందేంటి? శర్వానంద్ సినిమాపై పబ్లిక్ టాక్ ఇదే..
‘వృషకర్మ’.. మైథాలజీతో మిస్టరీ!
ఇక ఇదే డిసెంబర్ 4న విడుదలవుతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘వృషకర్మ’. నాగచైతన్య హీరోగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సుకుమార్ కథ అందించగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ పూర్తిగా భిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. సుమారు 5 వేల సంవత్సరాల నాటి రహస్యాలు, పురాతన గుహలు, వింత శిల్పాలు, అంతుచిక్కని అతీంద్రియ శక్తుల నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. నిధి అన్వేషకుడిగా కనిపించే నాగచైతన్య పాత్ర.. ఓ పురాతన రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఊహించని పరిణామాలను ఎదుర్కొంటుంది. సాధారణ అన్వేషణగా మొదలైన ప్రయాణం క్రమంగా మానవాళి ఉనికికే ప్రమాదంగా మారే శక్తులతో పోరాటంగా మారుతుంది.
వేద విజ్ఞానం, పురాతన రహస్యాలు, దుష్టశక్తుల ప్రభావం వంటి అంశాలను ట్రైలర్‌లో ఆసక్తికరంగా పరిచయం చేశారు. సూపర్‌నేచురల్ శక్తి ప్రభావానికి లోనైన చిన్నారి, భయానక దృశ్యాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. చివరకు సృష్టి ధర్మాన్ని కాపాడే బాధ్యత నాగచైతన్య పాత్రపై పడినట్లు ట్రైలర్ హింట్ ఇస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, గ్రాండ్ విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
నితిన్ vs నాగచైతన్య..
ఒకే రోజు విడుదలవుతున్న ఈ రెండు సినిమాల మధ్య ఆసక్తికరమైన జానర్ పోటీ కనిపిస్తోంది. ‘అలియాస్ రుక్మిణీ’ ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, కామెడితో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తుంటే.. ‘వృషకర్మ’ మైథాలజీ, మిస్టరీ, విజువల్ గ్రాండియర్‌తో థియేటర్లలో థ్రిల్ అందించేందుకు సిద్ధమవుతోంది.
నితిన్ తన కెరీర్‌లో ఓ కొత్త తరహా పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. నాగచైతన్య ‘వృషకర్మ’తో మరోసారి విభిన్నమైన జానర్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కథల పరంగా రెండు సినిమాలు పూర్తిగా భిన్నమైనవి కావడంతో వేర్వేరు వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే అవకాశముంది.
మరి డిసెంబర్ 4న బాక్సాఫీస్ వద్ద నితిన్ తన ఖాతాలో హిట్‌ను వేసుకుంటారా? లేక నాగచైతన్య ‘వృషకర్మ’తో మరోసారి మ్యాజిక్ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ట్రైలర్లు మాత్రం రెండు సినిమాలపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. అసలు విజేత ఎవరో తెలియాలంటే డిసెంబర్ 4 వరకు వేచి చూడాల్సిందే!
