రాజ్యాంగ సవరణ బిల్లు మళ్లీ పార్లమెంట్ ముందుకు రానుందా? ఈ నెల 30 నుంచి పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్రం నిర్ణయించడంతో ఈ చర్చ మొదలైంది. లోక్‌సభను 30న (సోమవారం), రాజ్యసభను డిసెంబర్ 2న (బుధవారం) తిరిగి సమావేశపరచాలని స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ను కేంద్రం కోరింది
ఏప్రిల్‌లో వీగిన బిల్లు
ఈ బిల్లు ఏప్రిల్ 17న జరిగిన ప్రత్యేక సిట్టింగ్‌లో అవసరమైన మెజారిటీ దక్కక వీగిపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లు పాసు కావాలంటే సభకు హాజరై ఓటేసిన వారిలో మూడింట రెండొంతుల మద్దతు కావాలి. 543 మంది సభ్యుల లోక్‌సభలో ఆ సంఖ్య 361గా లెక్కగట్టారు. ఎన్డీయేకు 320 మంది సభ్యులు ఉండగా, ఆ తర్వాత 26 మంది ఎంపీలు ప్రతిపక్ష శిబిరం నుంచి బయటికొచ్చారు. 20 మంది తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో విలీనమై ఎన్డీయేకు మద్దతు ప్రకటించగా, శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే శివసేనలో చేరారు. దీంతో ఎన్డీయే బలం 346కు చేరినా, బిల్లు పాసుకు ఇంకా 15 మంది మద్దతు కావాలి. 22 మంది ఎంపీలున్న డీఎంకే, 8 మంది ఉన్న ఎన్సీపీ (శరద్ పవార్) కీలకం కానున్నాయి. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చర్చిస్తామని, దేశ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే మద్దతిస్తామని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే చెప్పారు.
100 రోజులైనా ప్రొరోగ్ కాలే
శీతాకాల సమావేశాల ప్రకటనలో జాప్యంపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన వర్షాకాల సమావేశాలను 100 రోజులు దాటినా ఇంకా ప్రొరోగ్ చేయలేదు. డీలిమిటేషన్‌తో పాటు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాలు ఈ సిట్టింగ్‌లో కేంద్రాన్ని నిలదీయనున్నాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేయనున్నాయి.
