మీ ఫోన్ ఎక్కడైనా పోయిందా? లేదా ఎవరైనా దొంగిలించారా ? ఫోన్‌లో మీ పర్సనల్ డేటా, బ్యాంకింగ్ వివరాలు ఉన్నాయని టెన్షన్ పడుతున్నారా ? అయితే వెంటనే ఒక పని చేయండి. కేంద్ర ప్రభుత్వ సంచార్ సాథీ పోర్టల్ ద్వారా మీ ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చు. ఇందుకోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన తర్వాత, ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందామా....
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఆన్ లైన్ బ్యాంకింగ్ నుంచి పర్సనల్ ఫొటోలు, ముఖ్యమైన డాక్యుమెంట్ల వరకు అన్నీ ఫోన్‌లోనే ఉంటున్నాయి. అలాంటి ఫోన్ ఒక్కసారిగా పోతే ఎంత టెన్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ దొంగిలించినోళ్లు అందులోని సమాచారాన్ని దుర్వినియోగం చేస్తారేమోనని చాలామంది భయపడుతుంటారు.
అయితే ఫోన్ పోయినంత మాత్రాన సిమ్, ఇతర వివరాలతో దొంగలను పట్టుకునేంత శ్రమ లేదు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంచార్ సాథీ (Sanchar Saathi) సర్వీస్ తో మీ ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చు. ముఖ్యంగా మీ ఫోన్ IMEI నంబర్‌ను బ్లాక్ చేయడం ద్వారా హ్యాండ్‌సెట్ ఇండియాలో ఏ మొబైల్ నెట్‌వర్క్‌లో పనిచేయకుండా చేయవచ్చు.
సంచార్ సాథీ అంటే ఏమిటి?
స్మార్ట్ ఫోన్ వినియోగదారుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 2023లో సంచార్ సాథీ పోర్టల్‌ను ప్రారంభించింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ అందిస్తున్న ఈ సర్వీస్ ద్వారా మొబైల్ వినియోగదారులు ఈ పనులు చేసుకోవచ్చు.
*పోగొట్టుకున్న లేదా దొంగిలించిన స్మార్ట్ ఫోన్‌ను IMEI నంబర్ ద్వారా బ్లాక్ చేయవచ్చు.
*బ్లాక్ చేసిన ఫోన్ మళ్ళీ దొరికితే అన్‌బ్లాక్ చేసుకోవచ్చు.
*మీ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు.
*అనుమానిత, ఫ్రాడ్ కాల్స్ గురించి ఫిర్యాదు చేయవచ్చు.
*నకిలీ లేదా అనుమానిత మొబైల్ ఫోన్ల వివరాలను చెక్ చేయవచ్చు.
*భారతీయ నంబర్ల నుంచి వస్తున్నట్లు కనిపించే అంతర్జాతీయ ఫేక్ కాల్స్‌ను రిపోర్ట్ చేయవచ్చు.
*ఈ సేవలను సంచార్ సాథీ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు.
ఫోన్ బ్లాక్ చేయలంటే
*మీ ఫోన్ పోయినా, దొంగిలించినా ముందు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కంప్లైంట్ కాపీ లేదా FIR కాపీ తీసుకోవాలి.
*పోయిన ఫోన్‌లో వాడిన మొబైల్ నంబర్ సిమ్ మళ్ళీ తీసుకోవాలి. OTP వెరిఫికేషన్ కోసం ఇది అవసరం.
*ఆధార్ వంటి గుర్తింపు కార్డు ఉండాలి.
* ఫోన్ కొన్నప్పుడు ఇచ్చిన ఇన్వాయిస్ లేదా బిల్లు కాపీ ఉండాలి.
*మీ ఫోన్ IMEI నంబర్ మీకు తెలిసి ఉండాలి. సాధారణంగా ఫోన్ బాక్స్ వెనుక లేదా బిల్లుపై ఉంటుంది.
ఈ వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సంచార్ సాథీ యాప్ ద్వారా ఎలా బ్లాక్ చేయాలి?
*ముందుగా Sanchar Saathi యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
*యాప్ ఓపెన్ చేసి మీ భాషను ఎంచుకోండి.
*తర్వాత 'Proceed' బటన్‌పై క్లిక్ చేయండి.
*యాప్‌లో 'Explore Services' క్లిక్ చేసి స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించి మీ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి.
*రిజిస్ట్రేషన్ తర్వాత 'Block Your Lost/Stolen Mobile Handset' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
*ఇప్పుడు 'Block Lost/Stolen Mobile'పై క్లిక్ చేయండి.
*అక్కడ కనిపించే ఫారంలో మీ ఫోన్ నంబర్, IMEI నంబర్, మొబైల్ బ్రాండ్, మోడల్, ఫోన్ ధర వంటి వివరాలను ఎంటర్ చేయండి.
*ఫోన్ కొన్న బిల్లు కాపీ అప్‌లోడ్ చేయండి.
*తర్వాత ఫోన్ ఎక్కడ పోయింది, ఏ రాష్ట్రం, జిల్లా, పోలీస్ స్టేషన్ పరిధిలో పోయింది, ఏ తేదీన పోయింది వంటి వివరాలను నమోదు చేయండి.
*పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు నంబర్ ఎంటర్ చేసి, ఫిర్యాదు కాపీని అప్‌లోడ్ చేయండి.
*ఫోన్ ఓనర్ పేరు, చిరునామా, గుర్తింపు కార్డు వివరాలు, ఈ-మెయిల్, OTP కోసం మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయండి.
*చివరగా క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి 'Get OTP'పై క్లిక్ చేయండి.
*మీ మొబైల్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి, డిక్లరేషన్‌ను అంగీకరించి దరఖాస్తును సబ్మిట్ చేయండి.
*మీ రిక్వెస్ట్ విజయవంతం అయిన తర్వాత మీకు రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. తర్వాత మీ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
వెబ్‌సైట్ ద్వారా ఫోన్‌ను ఎలా బ్లాక్ చేయాలి?
*ముందుగా కేంద్ర ప్రభుత్వ సంచార్ సాథీ అధికారిక వెబ్‌సైట్ https://www.sancharsaathi.gov.inను ఓపెన్ చేయండి.
*అందులో 'Block Your Lost/Stolen Mobile Handset' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
*ఫోన్ బ్లాక్ చేయడానికి అవసరమైన సూచనలు, పత్రాల వివరాలను చదవండి.
*తర్వాత ఫారంలో మీ మొబైల్ నంబర్, IMEI నంబర్, ఫోన్ బ్రాండ్, మోడల్ వివరాలను ఎంటర్ చేయండి.
*ఫోన్ పోయిన ప్రదేశం, తేదీ, పోలీస్ ఫిర్యాదు వివరాలను ఎంటర్ చేయండి.
*ఫోన్ యజమాని వ్యక్తిగత వివరాలు, గుర్తింపు వివరాలను ఇవ్వండి.
*ఫోన్ బిల్లు, పోలీస్ ఫిర్యాదు కాపీ అప్‌లోడ్ చేయండి.
*క్యాప్చా ఎంటర్ చేసి OTP పొందండి.
*OTP వెరిఫికేషన్ పూర్తయ్యాక డిక్లరేషన్ అంగీకరించి దరఖాస్తు సబ్మిట్ చేయండి.
మీ రిక్వెస్ట్ రిజిస్టర్ అయినట్లు మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. అందులో ఇచ్చే రిక్వెస్ట్ నంబర్‌ను జాగ్రత్తగా పెట్టుకోండి.
ఫోన్ దొరికితే మళ్లీ అన్‌బ్లాక్ చేసుకోవచ్చా?
అవును. మీరు బ్లాక్ చేసిన ఫోన్ మళ్ళీ దొరికితే సంచార్ సాథీ పోర్టల్‌లో అన్‌బ్లాక్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత అన్‌బ్లాక్ ఆప్షన్‌ను క్లిక్ చేసి, అవసరమైన వివరాలు, రిక్వెస్ట్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఫోన్‌ను తిరిగి సిమ్ వేసుకొని ఉపయోగించుకోవచ్చు.
గుర్తుంచుకోండి!
ఫోన్‌లోని IMEI నంబర్‌ను బ్లాక్ చేసినంత మాత్రాన ఫొటోలు, వ్యక్తిగత సమాచారం ఆటోమేటిక్‌గా తొలగిపోవు. ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మీ సిమ్ బ్లాక్ చేయించండి. బ్యాంకింగ్ యాప్స్, ఈ-మెయిల్, సోషల్ మీడియా అకౌంట్స్ పాస్ వార్డ్ మార్చుకోండి.
