యువకుడిని చంపి.. ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం.. సీసీ టీవీ ఫుటేజ్ వైరల్

యువకుడిని చంపి.. ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం.. సీసీ టీవీ ఫుటేజ్ వైరల్

వరంగల్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు దుండగులు. యువకుడిని హత్య చేసిన అనంతరం ఈడ్చుకెళ్తున్న ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. 

వరంగల్‌లోని విశ్వకర్మ వీధిలో శివనగర్ ఎ.సి. రెడ్డినగర్‌కు చెందిన విక్రమ్ అనే యువకుడు గురువారం(నవంబర్ 26) రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని హత్య చేసిన అనంతరం, మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.  ఈ హత్య ఉదంతం అంతా  అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. 

సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. యువకుడిని ఎవరు హత్య చేశారు? హత్యకు గల కారణాలేంటి? ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎందుకు ప్రయత్నించారు? అనే కోణాల్లో  దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. విక్రమ్ హత్య వెనుక ఉన్న కారణాలు, ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.