డిసెంబర్‌లో మారనున్న క్రెడిట్ కార్డ్, పెన్షన్, ఇన్వెస్ట్మెంట్ రూల్స్.. మీపై పడే ప్రభావం ఇదే!

డిసెంబర్‌లో మారనున్న క్రెడిట్ కార్డ్, పెన్షన్, ఇన్వెస్ట్మెంట్ రూల్స్.. మీపై పడే ప్రభావం ఇదే!

డిసెంబర్ 1 నుంచి బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్, పెన్షన్‌కి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక మార్పులు రానున్నాయి. ఎస్బీఐ కార్డ్ ఛార్జీల పెంపు, కమోడిటీ మార్కెట్ మార్జిన్ రూల్స్, విదేశీ ఇన్వెస్టర్లకు కేవైసీ మార్పులు వంటి మార్పులు అమలులోకి రానున్నాయి. వీటితో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్నందున వాటి ప్రభావం మనపై ఎంత వరకూ ఉంటుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి.. 

SBI కార్డ్ ఛార్జీల పెంపు:
SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు డిసెంబర్ 1 నుంచి ట్రాన్స్‌పోర్ట్, ఇంధన లావాదేవీలపై అదనపు ఛార్జీలు పడనున్నాయి. రవాణా రంగానికి చెందిన లావాదేవీలు రూ.30 వేలు దాటితే 1 శాతం ఛార్జీ విధిస్తారు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు రూ.40 వేలు ఖర్చు చేస్తే.. మొత్తం చేసిన ఖర్చుపై రూ.400 అదనపు ఫీజు పడుతుంది. ఇంధన ఖర్చుల విషయంలో ఒక బిల్లింగ్ సైకిల్‌లో ఎస్బీఐ కార్డ్ ద్వారా చేసే ఖర్చు రూ.50 వేలు దాటితే 1 శాతం ఫీజు విధిస్తారు. రూ.60 వేల ఇంధన లావాదేవీలు చేస్తే రూ.600 ఛార్జీతో పాటు వర్తించే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

RBI వడ్డీ రేట్ల సమీక్ష:
రిజర్వు బ్యాంక్ మానిటరీ పాలసీ సమావేశం డిసెంబర్ 2 నుంచి 4 వరకు జరగనుంది. దేశ ఆర్థిక పరిస్థితులను బట్టి వడ్డీ రేట్లలో మార్పులు చేయాలా వద్దా అనే అంశంపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. గత అక్టోబర్ సమీక్షలో RBI రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. డిసెంబర్ సమావేశంలో రేట్లు పెంచితే హోమ్ లోన్, కారు లోన్ ఈఎంఐలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. 

కమోడిటీ మార్కెట్ మార్జిన్లు:
కమోడిటీ మార్కెట్ నిబంధనలను సెబీ సవరించింది. వస్తువుల ధరల్లో వచ్చే ఓలటాలిటీ ఆధారంగా మార్జిన్లను నిర్ణయించనున్నారు. డిసెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చే ఈ విధానంలో తక్కువ ఓలటాలిటీ ఉన్న వస్తువులకు 6 శాతం, మధ్యస్థంగా ఉండే వాటికి 8 శాతం, ఎక్కువ ఓలటాలిటీ ఉన్న వస్తువులకు 10 శాతం కనీస మార్జిన్ ఉండాలి. వ్యవసాయ, వ్యవసాయేతర వస్తువులకు ఇది వర్తిస్తుంది. రిస్క్ మేనేజ్‌మెంట్ బలోపేతం చేయడం కోసం ఈ మార్పులు తెచ్చినట్లు సెబీ పేర్కొంది.

విదేశీ ఇన్వెస్టర్లకు కేవైసీ సడలింపు:
భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్లు, ఎన్ఆర్ఐలు, ఓసీఐ కార్డుదారులు డిసెంబర్ 3 నుంచి డిజిటల్ కేవైసీని రిమోట్ పద్ధతిలో పూర్తి చేయవచ్చు. గతంలో కేవైసీ కోసం ఇండియాలో ఉండాలనే నిబంధన ఉండేది. ఇప్పుడు విదేశాల నుంచే సెబీ గుర్తింపు పొందిన సంస్థల ద్వారా డిజిటల్ పద్ధతిలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

పెన్షనర్లకు గడువు.. ఆధార్ అప్‌డేట్:
పెన్షన్ పొందుతున్న వారు నవంబర్ 30 లోగా తమ వార్షిక లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్) సమర్పించాల్సి ఉంటుంది. గడువులోగా సర్టిఫికెట్ ఇవ్వకుంటే డిసెంబర్ నుంచి పెన్షన్ రావడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. డిజిటల్ పద్ధతిలోనూ దీన్ని అప్ లోడ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఆధార్ వినియోగదారులు తమ ఈమెయిల్ అడ్రస్ అప్‌డేట్ చేసుకోవడానికి యూఐడీఏఐ ఫీజు మినహాయింపు ఇచ్చింది. మొబైల్ యాప్ ద్వారా చేసే ఈ అప్‌డేట్‌కు డిసెంబర్ 31 వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవని సంస్థ స్పష్టం చేసింది.