పార్కులో ఒంటరిగా బెంచిపై కూర్చున్న మహిళకు జరిమానా విధించిన ఘటన వైరల్ గా మారింది. పార్కులో కూర్చుంటే ఫైన్ ఏంటి..? పరిసరాలను అపరిశుభ్రం చేయలేదు, పార్కు ఓపెన్ గా ఉన్న్ సమయంలోనే కూర్చున్నారు.. మరి ఎందుకు అనేది ఆసక్తికరమైన విషయం. కారణం తెలిసి నెటిజన్లు నోరెళ్లబెట్టారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
జర్మనీలోని గెల్సెన్కిర్చెన్ నగరంలో ఒక వింత ఘటన జరిగింది. పిల్లల పార్కులో ఉన్న బెంచీపై ఒంటరిగా కూర్చున్నందుకు ఒక మహిళకు అధికారులు 25 యూరోలు (రూ. 2,540) జరిమానా విధించారు.
హనా అనే 31 ఏళ్ల మహిళ చదువు, ఆర్థిక ఇబ్బందుల వల్ల తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. 2026 అక్టోబర్ 25న ఆమె మనశ్శాంతి కోసం బయటకు వెళ్లారు. నడుస్తూ వెళ్లి సమీపంలోని ఒక ప్లేగ్రౌండ్ లో ఉన్న బెంచీపై కూర్చున్నారు. అక్కడ ఆమె బాధతో ఏడుస్తుండగా ముగ్గురు మున్సిపల్ అధికారులు ఆమె దగ్గరకు వచ్చారు. అక్కడ ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు మీ పిల్లలేనా అని అడిగారు. కాదని చెప్పడంతో వారు జరిమానా రశీదు ఇచ్చారు.
గెల్సెన్కిర్చెన్ మున్సిపల్ నిబంధనల ప్రకారం ప్లేగ్రౌండ్లు కేవలం 14 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రమే కేటాయించారు. అయితే పిల్లల గార్డియన్స్ కు కూడా అక్కడ అనుమతి ఉంటుంది. పిల్లలు లేకుండా పెద్దలు ఒంటరిగా పార్కులో కూర్చోవడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. మానవత్వంతో ఆలోచించకుండా జరిమానా వేయడంపై హనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరైనా ఏడుస్తుంటే సహాయం కావాలా అని అడగాల్సింది పోయి శిక్ష వేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు.
స్థానికులు కూడా అధికారుల చర్యను తప్పుబడుతున్నారు. దశాబ్దాలుగా తాము అక్కడ కూర్చుంటున్నామని, ఎప్పుడూ ఇలా జరగలేదని ఒక వృద్ధురాలు చెప్పారు. అయితే సిటీ కౌన్సిల్ సభ్యుడు సైమన్ నొవాక్ ఈ చర్యను సమర్థించారు. ప్లేగ్రౌండ్లు పిల్లల కోసమేనని, పెద్దలకు అక్కడ అనుమతి లేదని స్పష్టం చేశారు. పిల్లలను ఎత్తుకుపోయే ఘటనలు జరుగుతున్నాయని, అపహరణలను అరికట్టడానికి, పార్కులను ఇతరులు వాడకుండా చూడటానికే ఈ రూల్స్ తెచ్చినట్లు అధికారులు తెలిపారు.
ALSO READ : ప్రేమలో మంచితనమే శాపమా ? మంచి మనసున్నవాళ్లు సింగిల్గానే మిగిలిపోతున్నారా ?
ప్రస్తుతం ఈ నిబంధనను ఉల్లంఘిస్తే 55 యూరోల (రూ. 5,613) వరకు జరిమానా విధిస్తున్నారు. దీన్ని 60 యూరోలకు (రూ. 6,121) పెంచాలని కౌన్సిల్ చర్చలు జరుపుతోంది. ఈ నిబంధనలు మంచికే అని కొందరు.. ఏడుస్తున్న మహిళ సమస్య ఏంటో తెలుసుకోకుండా ఇలా వ్యవహరించడమేంటని కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
