ప్రేమలో మంచితనమే శాపమా ? మంచి మనసున్నవాళ్లు సింగిల్‌గానే మిగిలిపోతున్నారా ?

ప్రేమలో మంచితనమే శాపమా ? మంచి మనసున్నవాళ్లు సింగిల్‌గానే మిగిలిపోతున్నారా ?

నిజాయితీగా ఉండేవాళ్లు, ఎదుటివారి గురించి ఆలోచించేవాళ్లు, కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునేవాళ్లకు ప్రేమలో అదృష్టం తక్కువా ? మోసాలు చేసే వాళ్లు, ఎదుటివారిని   మాటలతో బుట్టలో వేసుకునేవాళ్లే త్వరగా ప్రేమలో పడుతున్నారా ? జర్మనీలో జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అయితే సింగిల్‌గా ఉన్నంత మాత్రాన మీలో ఏదో లోపం ఉన్నట్లు కాదు!

ప్రేమలో పడాలని చాలామందికి ఉంటుంది. వాళ్ళను అర్థం చేసుకునే వ్యక్తి దొరకాలని, జీవితాన్ని పంచుకునే తోడు ఉండాలని కోరుకుంటారు. కానీ కొందరికి ఎంత ప్రయత్నించినా సరైన భాగస్వామి దొరకరు. ఇంకొందరేమో ఒకరి తర్వాత మరొకరు ప్రేమలో పడుతుంటారు. అసలు ఈ తేడాకు కారణమేంటి ? మంచి మనసున్నవాళ్లకు ప్రేమ ఎందుకు దూరమవుతోంది ? నిజాయితీగా ఉండటం, ఎదుటివారిని మోసం చేయకుండా ఉండడం కూడా డేటింగ్‌లో వెనుకబడేలా చేస్తుందా?

ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేసింది జర్మనీలో జరిగిన ఓ అధ్యయనం. జర్నల్ ఆఫ్ పర్సనాలిటీలో ప్రచురించిన ఈ పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, అంతర్ముఖ స్వభావం, కొన్ని వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నవారు ఎక్కువగా సింగిల్‌గా మిగిలిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

మంచి మనసుంటే ప్రేమలో వెనుకబడినట్లేనా?
ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిని వారి వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా పరిశీలించారు. ఇందుకోసం బిగ్ ఫైవ్ వ్యక్తిత్వ లక్షణాలైన కొత్త అనుభవాల పట్ల ఆసక్తి, కలుపుగోలుతనం, భావోద్వేగ స్థిరత్వం, బాధ్యతాయుత ప్రవర్తన, ఇతరులతో కలిసిపోయే స్వభావాన్ని అంచనా వేశారు. అలాగే నార్సిసిజం, మాకియవెల్లియనిజం, సైకోపతీ వంటి డార్క్ ట్రయాడ్ లక్షణాలను కూడా పరిశీలించారు.

ఈ పరిశోధనలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉన్నవారు, కొన్ని రకాల నార్సిసిజం, సైకోపతీ లక్షణాలు ఎక్కువగా ఉన్నవారు సింగిల్‌గా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపించాయి. మరోవైపు నలుగురితో కలిసిపోయే స్వభావం ఉన్నవారు, బాధ్యతగా వ్యవహరించేవారు, క్రమశిక్షణతో ఉండేవారు భాగస్వామిని కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. ఎదుటివారిని వారికీ అనుకూలంగా మలుచుకోవడం, అవసరానికి తగ్గట్లు మాట మార్చడం, తెలివిగా వ్యవహరించడం తెలిసినవారు కూడా డేటింగ్ మొదట్లోనే  ఈజీగా ఆకట్టుకోగలుగుతారు. కానీ ఒకరిని ఆకర్షించడం వేరు.. వారితో జీవితాంతం కలిసి ఉండటం వేరు.

మోసగాళ్లకే ప్రేమలో ఎక్కువ అవకాశాలా ?
కొంతమంది ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి మనసులో ఏముందో త్వరగా పసిగడతారు. అవతలి వ్యక్తి ఏం వినాలనుకుంటున్నారో తెలుసుకుని అందుకు తగ్గట్టుగా మాట్లాడతారు. వారిపై మంచి అభిప్రాయం ఏర్పడేలా ప్రవర్తిస్తారు. ఇలాంటి వారికి పరిచయాల మొదట్లో  మంచి అవకాశాలు లభించవచ్చు.

దీనికి భిన్నంగా నిజాయితీగా ఉండేవారు వారి గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి టైం  తీసుకుంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. దీంతో కొన్నిసార్లు వారు ఇంట్రెస్ట్  చూపడం లేదని అవతలి వ్యక్తులు పొరబడవచ్చు. అయితే మొదట్లో ఆకట్టుకోవడం కోసం వేసే ప్లాన్స్  ఎక్కువకాలం పనిచేయకపోవచ్చు. బంధం నిలబడాలంటే నమ్మకం, ప్రేమ, గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం చాలా అవసరం.

అసలు మాకియవెల్లియనిజం అంటే ఏమిటి?
ఈ పరిశోధనలో ప్రస్తావించిన డార్క్ ట్రయాడ్‌లో మాకియవెల్లియనిజం కూడా ఒకటి. 16వ శతాబ్దానికి చెందిన ఇటలీ రాజకీయ ఆలోచనాపరుడు నికోలో మాకియవెల్లి పేరు మీద దీనికి ఆ పేరు వచ్చింది. ఇతరులను వారి  ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడం, అవసరమైతే మోసం చేసేలా వ్యవహరించడం, ప్రతి విషయాన్ని ఒక ప్లాన్ లాగ చూడటం ఈ లక్షణం ఉన్నవారిలో కనిపించవచ్చు.

సైకోపతీ లక్షణాలు ఉన్నవారు కొన్నిసార్లు ఇతరుల భావాలను పట్టించుకోకుండా వ్యవహరించవచ్చు. నార్సిసిస్టులు వాళ్ళని వాళ్ళు  ఎక్కువగా ఇష్టపడుతూ, ఇతరుల నుంచి ప్రశంసలు కోరుకుంటారు. మాకియవెల్లియనిజం ఉన్నవారు మాత్రం వారి లక్ష్యాలను చేరుకోవడానికి పక్కా ప్రణాళికతో వ్యవహరించవచ్చు. అయితే ఈ లక్షణాలు ఉన్నవారు ప్రేమలో విజయవంతమైనవారని, మంచి భాగస్వాములని చెప్పలేం. ఒకరిని ఆకర్షించడం, వారితో  మంచి ఆరోగ్యకరమైన బంధాన్ని కొనసాగించడం రెండూ వేర్వేరు విషయాలు.

ఇంట్రోవర్ట్స్ ప్రేమకు దూరమా?
చాలామంది ఇంట్రోవర్ట్స్చూ ను చుసి వారు ఎవరితోనూ కలవడానికి ఇష్టపడరని, ఎక్కువగా మాట్లాడరని అనుకుంటారు. కొన్నిసార్లు వారిని అహంకారులుగా కూడా పొరబడుతుంటారు. కానీ అది నిజం కాకపోవచ్చు. ఇంట్రోవర్ట్స్   అందరితోనూ వెంటనే కలిసిపోరు. వారికీ నచ్చిన వ్యక్తులతోనే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచిస్తారు. పెద్ద పెద్ద పార్టీల కంటే ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడతారు.

ALSO READ : చలికి చర్మం పగులుతుందా..ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిగ నిగ మెరిసిపోద్ది..!

అంతమాత్రాన వారికి ప్రేమించటం రాదని కాదు. పైగా ఇలాంటి వారిలో చాలామంది భావోద్వేగాలకు, నమ్మకానికి, బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. అయితే వారి భావాలను బయటపెట్టడంలో కాస్త సమయం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు మంచి పరిచయాలు కూడా ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు .

సింగిల్‌గా ఉన్నవాళ్లంతా సైకోపాత్‌లేనా?
సమాజంలో పెళ్లి కానివారిని, ప్రేమలో లేనివారిని చూసి ఏదో ఒక కారణం వెతికే అలవాటు ఉంది. 'ఎవరూ దొరకలేదా?', 'నీకు ఇంకా పెళ్లి కాలేదా?', 'నీలో ఏమైనా సమస్య ఉందా?' అంటూ ప్రశ్నలు వేస్తుంటారు. కానీ సింగిల్‌గా ఉండటానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కొందరికి సరైన వ్యక్తి దొరకకపోవచ్చు. మరికొందరు స్వేచ్ఛను, వ్యక్తిగత జీవితాన్ని ఇష్టపడవచ్చు. ఇంకొందరు ప్రస్తుతం కెరీర్, కుటుంబం, ఇతర లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తుండవచ్చు.

గురుగ్రామ్‌లోని మారెంగో ఆసియా హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ సైకాలజిస్ట్ డాక్టర్ అభిప్రాయం ప్రకారం.. ఒంటరిగా ఉండటం అనేది వ్యక్తిలో ఏదో లోపం ఉందని చెప్పడానికి నిదర్శనం కాదు. అలాగే ఒకరికి భాగస్వామి ఉన్నంత మాత్రాన వారు మానసికంగా సంతోషంగా ఉన్నారని కూడా చెప్పలేం. సైకోపతీ అనే పదాన్ని కూడా ప్రతి సందర్భంలోనూ మానసిక రోగంగా భావించకూడదు. కొన్ని వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నంత మాత్రాన వారిని సైకోపాత్‌లుగా ముద్ర వేయడం సరైంది కాదు.

కొత్త విషయాలపై ఆసక్తి ఉంటే తప్పా?
అసలు కానే కాదు! కొత్త ప్రదేశాలకు వెళ్లాలని, కొత్త మనుషులను కలవాలని, విభిన్నమైన అనుభవాలను పొందాలని కోరుకునే వ్యక్తుల్లో తప్పేముంది ? అలాంటి వారికి వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్రంగా జీవించడం కూడా ముఖ్యమై ఉండవచ్చు. వారు ప్రేమను కోరుకోరని కాదు. వారి వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేకుండా, వారిని వారు  అర్ధం చేసుకునే వ్యక్తి కోసం ఎదురుచూస్తుండవచ్చు. ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన బంధం నచ్చాలని లేదు కదా!

సింగిల్‌గా ఉండటం కూడా ఒక ఎన్నుకునే ప్రక్రియ!
ప్రేమలో ఉండటం, పెళ్లి చేసుకోవడం జీవితంలో సాధించిన విజయాలను కొలవడం కాదు. అలాగే ఒంటరిగా ఉండటం ఫెయిల్యూర్  కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తి జీవితంలో భాగస్వామి లేకపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. దాన్ని బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదు. ప్రేమించగల సామర్థ్యం, ఎదుటివారిని గౌరవించే గుణం, నిజాయితీ, సానుభూతి వంటివి సంబంధాలను బలంగా నిలబెట్టే లక్షణాలు.

కాబట్టి మీరు సింగిల్‌గా ఉన్నారని బాధపడాల్సిన అవసరం లేదు. మీ మంచితనాన్ని మార్చుకోవాల్సిన పనీ లేదు. సరైన వ్యక్తి కోసం ఎదురుచూడటం తప్పు కాదు. ఎందుకంటే ప్రేమలో గెలవడం అంటే ఎవరో ఒకరిని ఆకట్టుకోవడం కాదు.. మనల్ని మనంగా అంగీకరించే వ్యక్తితో మంచి బంధాన్ని నిర్మించుకోవడం!