ఏఐ ఎఫెక్ట్: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి 340 మంది లేఆఫ్

ఏఐ ఎఫెక్ట్: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి 340 మంది లేఆఫ్

క్విక్ కామర్స్ రంగంలో పెరుగుతున్న పోటీ, నష్టాల భారం మధ్య.. ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ సంస్థ స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. తన క్విక్ కామర్స్ డిపార్ట్మెంట్ 'ఇన్‌స్టామార్ట్' నుంచి 340 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. AI వాడకం పెరుగుతున్న వేళ.. వ్యాపారాన్ని రీస్ట్రక్చరింగ్ చేసి కంపెనీ వృద్ధికి సిద్ధం చేసేందుకే లేఆఫ్స్ చేస్తున్నట్లు వెల్లడించింది. గత కొన్ని త్రైమాసికాలుగా ఇన్‌స్టామార్ట్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం.. నష్టాలు అంతకంతకూ పెరుగుతుండటంతో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ తొలగింపుల ప్రభావం ప్రధానంగా ఇన్‌స్టామార్ట్‌లోని కార్పొరేట్, సపోర్ట్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై పడింది. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి కంపెనీ తగిన సెవరెన్స్ ప్యాకేజీ, కొత్త ఉద్యోగం వెతుక్కోవటంలో సహాయం, అలాగే ఇతర ప్రాంతాలకు మారేందుకు రీలోకేషన్ సేవలను అందిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై స్విగ్గీ అధికారికంగా ఇంకా స్పందించలేదు.

మరోవైపు క్విక్ కామర్స్ విభాగంలో బ్లింకిట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, అమెజాన్ నౌ వంటి ప్రత్యర్థుల నుంచి ఇన్‌స్టామార్ట్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. అయినప్పటికీ స్విగ్గీ వద్ద సుమారు రూ.13వేల 500 కోట్ల నగదు నిల్వలు ఉండటంతో ఆర్థికంగా బలంగానే ఉంది.

ఇటీవల ఇన్‌స్టామార్ట్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నందితా సిన్హా సంస్థ వ్యూహాల్లో మార్పులు చేస్తున్నారు. నష్టాలను తగ్గించుకుని లాభాల బాట పట్టేందుకు సొంత బ్రాండ్ల విక్రయాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈ మార్పుల్లో భాగంగానే తాజా ఉద్యోగ కోతలు చోటుచేసుకున్నాయి.