న్యూఢిల్లీ: తిరుప్పరంకుండ్రం దీపం కేసులో విజయ్ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం దగ్గర కార్తీక దీపాన్ని వెలిగించాలని 2026, నవంబర్ 20న ఇచ్చిన తమ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు తమిళనాడు సీఎస్, డీజీపీ సహా 15 మందికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. హెచ్ఆర్ అండ్ సీఈ సెక్రటరీ, కమిషనర్, మదురై జిల్లా కలెక్టర్, సీపీ, ఎస్పీ, ఆలయ అధికారులకు కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది.
ఈ నోటీసులను మూడు రోజుల్లోగా సంబంధిత అధికారులకు అందజేయాలని సీఎస్‌ను కోర్టు ఆదేశించింది. దీనిపై వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్‌ను కోరింది. తమపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలని సీఎస్, డీజీపీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నోటీసులు అందుకున్న వారంతా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అరవింద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో పరిపాలన గందరగోళంగా ఉన్నట్లు తెలుస్తోందని.. ముఖ్యంగా మధురై జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. తిరుప్పరంకుండ్రం దీపం వ్యవహారంలో విజయ్ ప్రభుత్వ తీరు కోర్టు ధిక్కారణమేనని వ్యాఖ్యానించారు. కోర్టు ధిక్కారణ చర్యలను ఇకపై కఠినంగా ఎదుర్కోవాల్సిన సమయం వచ్చిందని.. లేకపోతే దేశంలో రాజ్యాంగపరమైన గందరగోళం ఏర్పడుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
పాలకమండలి రద్దు
తిరుపరంకుండ్రం ఆలయ పాలకమండలిని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆలయ ట్రస్ట్ రిసీవర్లుగా రిటైర్డ్ జడ్జీలు జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ పార్థిబన్‌లను నియమించింది.
సీఆర్పీఎఫ్ చేతికి భద్రత
తమిళనాడు పోలీసులు తమ పాత ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. దీంతో ఆలయం, కొండ ప్రాంతం భద్రతను సీఆర్పీఎఫ్కు అప్పగించింది. కొండపై ఉన్న ఆలయం, దర్గా రెండింటిలోనూ కార్యకలాపాలు ప్రశాంతంగా సాగేలా చూడాలని సీఆర్పీఎఫ్ను ఆదేశించింది. భక్తులు తమ మతపరమైన ఆచారాలు నిర్వహించుకునేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది.
వివాదం ఏంటంటే..?
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 24న మదురై జిల్లాలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద రాతి స్తంభం దగ్గర ఒక్కసారి దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు 2026, నవంబర్ 20న అనుమతి ఇచ్చింది. అయితే, సంప్రదాయాలకు విరుద్ధమంటూ ఆలయ బోర్డు తీర్మానం చేయడంతో అధికారులు అక్కడ దీపం వెలిగించలేదు. అధికారుల తీరును సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు.
