సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. 2025వ సంవత్సరానికి సంబంధించి జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక జ్యూరీ కమిటీకి ఛైర్మన్‌గా బాలకృష్ణను నియమించింది. ఈ మేరకు నవంబర్ 26న జారీ చేసిన జీవో నంబర్ 2213 ద్వారా ఈ నియామకాన్ని ప్రకటించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి, సీనియర్ నటి ప్రభ కమిటీలో సభ్యులుగా ఉండగా.. APSFTVTDC ఎండీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.
అవార్డుల బాధ్యతతో పాటు వరుస సినిమాలు..
ఒకవైపు రాజకీయాల్లో హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతూనే.. మరోవైపు సినిమాల్లోనూ వరుస ప్రాజెక్టులతో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సినిమా అవార్డుల ఎంపిక కమిటీకి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం ఆయన కెరీర్లో మరో ప్రత్యేకమైన పరిణామం.
'దాదా'గా బాలయ్య..
ఇక సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న 'దాదా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'వీరసింహారెడ్డి' సక్సెస్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు నెలకొన్నాయి. 1980ల నాటి ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. మాస్ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. సముద్రఖని, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.
కొరటాల శివతో బాలయ్య..
'దాదా' తర్వాత బాలకృష్ణ దర్శకుడు కొరటాల శివతో భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. NBK 112 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. 'పవర్ మీట్స్ పర్పస్.. మాస్ బికమ్స్ ఏ మూవ్మెంట్' అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌ను కూడా వెల్లడించారు.
సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. అయితే సినిమా కథాంశం, నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది. 'దాదా' తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుండటంతో బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
