ఐఫోన్‌కు 20 ఏళ్లు.. 2027లో బిగ్ సర్‌ప్రైజ్.. లిమిటెడ్ ఎడిషన్‌గా స్పెషల్ ఫోన్..?

ఐఫోన్‌కు 20 ఏళ్లు..  2027లో  బిగ్ సర్‌ప్రైజ్.. లిమిటెడ్ ఎడిషన్‌గా స్పెషల్ ఫోన్..?

ఐఫోన్ ప్రియులకు ఆపిల్ ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతోందా.. ?  ఐఫోన్ విడుదలై 20 ఏళ్లు పూర్తికావొస్తున్న సందర్భంగా 2027లో ప్రత్యేకమైన ఐఫోన్‌ను తీసుకొచ్చేందుకు కంపెనీ రెడీ ఆవుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి కొత్త డిజైన్‌తో పాటు సిరామిక్ బాడీని కూడా పరిచయం చేయవచ్చని చర్చ జరుగుతుంది. అయితే ఈ ఐఫోన్స్ లిమిటెడ్ ఎడిషన్ కింద కొన్ని మాత్రమే విడదలయ్యే  అవకాశం ఉందట!

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఆపిల్ ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ కోసం ఎదురుచూసే అభిమానులకు కంపెనీ ఏదో ఒక కొత్త ఫీచర్‌తో సర్‌ప్రైజ్ ఇస్తుంటుంది. అయితే 2027లో విడుదలయ్యే ఐఫోన్ మాత్రం మరింత ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఎందుకంటే  ఫస్ట్ టైం ఐఫోన్‌ను విడుదల చేసిన ఆపిల్‌కు 2027తో 20 ఏళ్లు పూర్తవుతాయి.

ఈ సందర్భంగా విడుదల చేయబోయే యానివర్సరి ఐఫోన్‌లో సరికొత్త డిజైన్‌తో పాటు సిరామిక్ మెటీరియల్‌ను ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఐఫోన్ 20 ప్రో ప్రత్యేక ఎడిషన్‌పై ఇప్పటికే యాపిల్ కొత్త ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సిరామిక్ బాడీతో కొత్త ఐఫోన్?
సమాచారం ప్రకారం.. చైనాకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ ఆపిల్ 2027  ఐఫోన్ కోసం తయారు చేసిన కొన్ని సిరామిక్ భాగాలను చూసినట్లు వెల్లడించాడు. అయితే ఈ సిరామిక్ భాగాల తయారీ సామర్థ్యం చాలా తక్కువగా ఉందని సమాచారం. దీన్ని బట్టి ఆపిల్ అన్ని ఐఫోన్ మోడళ్లలో ఈ మెటీరియల్‌ను ఉపయోగించకుండా, ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఫోన్ వెనుక భాగం మొత్తాన్ని సిరామిక్‌తో తయారు చేస్తారా ? లేక ఫోన్‌లోని కొన్ని భాగాలకే ఈ మెటీరియల్‌ను వాడతారా ? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అంతేకాదు, ఈ డిజైన్ ఇంకా ప్రయోగాల దశలోనే ఉండటంతో మార్కెట్లోకి వస్తుందనే గ్యారెంటీ కూడా లేదు.

ఫోన్ తయారీకి ఇంకా గ్రీన్ సిగ్నల్  
ఐఫోన్ 20 ప్రో సిరామిక్ ఎడిషన్ మార్కెట్లోకి రావాలంటే ముందుగా ఇంజనీరింగ్ వాలిడేషన్ టెస్టింగ్ (EVT)  విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ దశలో ఫోన్ హార్డ్‌వేర్ డిజైన్, ఉపయోగించిన మెటీరియల్స్, ఇతర కీలక భాగాలను కంపెనీలు పరీక్షిస్తాయి. ఈ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు వస్తేనే తరువాత తయారీకి  వెళ్తారు. అందువల్ల సిరామిక్ ఐఫోన్ తయారీపై ఆపిల్ ప్రయోగాలు చేస్తున్న... చివరకు ఈ మోడల్‌ను విడుదల చేస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం.

ఆపిల్‌కు సిరామిక్ కొత్తేమీ కాదు!
నిజానికి సిరామిక్ మెటీరియల్‌ను ఉపయోగించడం ఆపిల్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలో ఆపిల్ వాచ్‌లో సిరామిక్ ఎడిషన్లను కూడా తీసుకొచ్చింది. ముఖ్యంగా తెలుపు రంగు సిరామిక్ కేస్‌తో వచ్చిన ప్రీమియం వాచ్ మోడళ్లు ప్రజల  దృష్టిని ఆకర్షించాయి. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ప్రస్తుతం ఐఫోన్లలో ఉపయోగిస్తున్న Ceramic Shield, పూర్తిస్థాయి సిరామిక్ బాడీ రెండూ ఒకటి కావు.

Ceramic Shield అనేది గ్లాస్‌లో సిరామిక్ స్ఫటికాలను కలిపి తయారు చేసే ప్రత్యేకమైన రక్షణ పొర. ఇది ఫోన్ స్క్రీన్ మన్నికను పెంచడంలో సహాయపడుతుంది. కానీ సిరామిక్ బాడీ అంటే ఫోన్ బయటి భాగంలోనే సిరామిక్ మెటీరియల్‌ను ఉపయోగించడం. దీనివల్ల ఫోన్‌కు ప్రత్యేకమైన రూపాన్ని ఇవ్వడంతో పాటు ప్రీమియం ఫినిషింగ్‌ను అందించే అవకాశం ఉంది.

ఐఫోన్ 20 డిజైన్ కూడా పూర్తిగా మారనుందా?
2027లో విడుదలయ్యే ఐఫోన్‌లో సిరామిక్ మాత్రమే కాదు, డిజైన్ విషయంలోనూ ఆపిల్ భారీ మార్పులు చేయవచ్చని గతంలో పలు పుకార్లు వచ్చాయి. ఈ ఫోన్ నాలుగు అంచుల దగ్గరా కార్ప్  గ్లాస్ డిజైన్, టైటానియం ఫ్రేమ్‌తో కొత్త రూపంలో తీసుకురావచ్చని సమాచారం. అంటే ఇప్పటివరకు మనం చూస్తున్న ఐఫోన్ డిజైన్‌తో పోలిస్తే చాల వేరేలా  ఉండే అవకాశం ఉంది.

ఎప్పుడు మార్కెట్లోకి రావచ్చు?
ఆపిల్ అన్నివర్సరీ ఐఫోన్ మోడళ్లను సాధారణంగా సెప్టెంబర్‌లో విడుదల చేస్తుంటుంది. ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తే 2027 సెప్టెంబర్‌లో 20వ వార్షికోత్సవ ఐఫోన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. అయితే దీనికి ఐఫోన్ 20 ప్రో అనే పేరే పెడతారా ? లేక మరో ప్రత్యేకమైన పేరుతో తీసుకొస్తారా ? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మొత్తానికి 20 ఏళ్ల ఐఫోన్ ప్రయాణాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి ఆపిల్ ఏదో ప్రత్యేకమైన ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ లీకులు, అంచనాలే. ఆపిల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!