అమరావతి: రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, రాజధాని నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి, భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో 30 అంశాలతో కూడిన అజెండాకు ఆమోదం తెలిపింది.
పరిశ్రమల ఏర్పాటులో అనుమతుల జాప్యాన్ని నివారించేందుకు రూపొందించిన ఏపీ ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు-2026కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇటీవల జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ఆరు సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సంస్థల ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు రానుండగా, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
పెనుకొండలో రూ.19 వేల కోట్ల పెట్టుబడితో కియా రెండో ఆటోమొబైల్ ప్లాంట్ ఏర్పాటు, శ్రీకాకుళంలో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్, అచ్యుతాపురంలో సెయింట్ గోబైన్ ఫ్లోట్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతి నిర్మాణాలకు భారీ నిధులు
రాజధాని అమరావతిలో మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. సమీకృత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయాన్ని రూ.6,641 కోట్లకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ నిర్మాణ పనులకు నిధుల కేటాయింపుతో పాటు రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,215 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాఖమూరులో అమరావతి సంగమం నిర్మాణానికి రూ.626 కోట్లు, గ్రీన్ వర్క్స్ ప్యాకేజీ-2 కింద రూ.180.68 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది.
విద్యుత్ రంగానికి ప్రాధాన్యం
రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కోల్ ఇండియాతో జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ఏపీజెన్కోకు అనుమతిచ్చింది. మైలవరంలో 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు 1,127 ఎకరాల భూమి కేటాయింపు, నంద్యాల జిల్లాలో 210 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు బదిలీకి ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లాలో రోజుకు 12 టన్నుల సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
అనంతపురం జిల్లాలో 9,917 ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు, 4,352 మంది పట్టాదారులకు సంబంధించిన భూ రికార్డుల సవరణకు కేబినెట్ అనుమతించింది. రైల్వేకోడూరు పరిధిలో 10,192 ఎకరాలకు సంబంధించి వెబ్‌ల్యాండ్ రికార్డుల సవరణకు కూడా ఆమోదం తెలిపింది. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంపొందించడం, అమరావతి నిర్మాణాలను వేగవంతం చేయడం, భూ సమస్యలకు పరిష్కారం చూపడం వంటి లక్ష్యాలతో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారనున్నాయి.
