భారీ డేటా సెంటర్ పెట్టుబడుల విషయంలో భారత్ జాగ్రత్తగా ఉండాలని జేపీ మోర్గాన్ ఆర్థికవేత్తలు సజిద్ చినోయ్, సిద్ధార్థ్ జవాద్ హెచ్చరించారు. ఈ రంగంలో ఎక్కువ పెట్టుబడి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవసరమైనప్పటికీ జాబ్ క్రియేషన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. ఏఐ వాడకం పెరుగుతోంది.. కొత్త డేటా సెంటర్లు పెడితే జాబ్స్ వచ్చేస్తాయ్ అంటూ రాజకీయ నాయకులు చెప్పే మాటలు ఫేక్ ప్రచారమే అని జేపీ మోర్గాన్ హెచ్చరికలు చెప్పకనే చెబుతున్నాయి. డేటా సెంటర్ల కంటే ఏఐ అప్లికేషన్లు, ఫ్రంటియర్ మోడల్స్ వంటి ఇతర ఏఐ వ్యవస్థలపై దృష్టి పెట్టాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఉద్యోగాల కల్పనపై ప్రభావం:
డేటా సెంటర్లు భారీ పెట్టుబడులతో కూడుకున్నవని, నిర్మాణం పూర్తయిన తర్వాత ఉద్యోగాలు చాలా తక్కువగా వస్తాయని నివేదిక పేర్కొంది. కొలంబియా బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ స్టైన్ వాన్ నియువెన్బర్గ్ పరిశోధనను వారు ఉదాహరణగా చూపారు. 200 మెగావాట్ల డేటా సెంటర్ కోసం 8 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడితే గరిష్టంగా 150 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని అంచనా వేశారు. ఇదే స్థాయి పెట్టుబడిని ఇతర రంగాల్లో పెడితే దాదాపు 4 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని వారు వివరించారు. డేటా సెంటర్ల వైపు భారీగా డబ్బు మళ్లించడం వల్ల ఇతర రంగాల్లో వచ్చే అవకాశాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్థిక ప్రయోజనాలపై సందేహాలు:
ఈ రంగంలో విదేశీ పెట్టుబడుల వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలపై కూడా వారు సందేహాలు వ్యక్తం చేశారు. ఒక డేటా సెంటర్ పెట్టుబడిలో దాదాపు 70 శాతం దిగుమతి చేసుకున్న పరికరాలకే ఖర్చవుతుందని తెలిపారు. దీనివల్ల దేశీయంగా విలువ పెంపు పరిమితంగానే ఉంటుందని చెప్పారు. గ్లోబల్ హైపర్స్కేలర్ల యాజమాన్యంలో ఉండే ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే లాభాలు విదేశాలకే వెళ్లిపోతాయన్నారు. సబ్సిడీ ధరకే భూమి, రాయితీలు, పన్ను ప్రయోజనాలు కల్పించి డేటా సెంటర్లను ఆకర్షించడం వల్ల మన యువతకు, ప్రభుత్వాలకు పెద్దగా ఒరిగేదేమీ లేదని కుండబద్ధలు కొడుతున్నారు.
వనరులపై ఒత్తిడి:
ఆర్థిక అంశాలతో పాటు డేటా సెంటర్ల వల్ల విద్యుత్, నీటి వినియోగం భారీగా ఉంటుందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఇది స్థానిక మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెంచుతుందని చెప్పారు. అమెరికాలో కూడా ఇలాంటి ఆందోళనల వల్ల పెద్ద డేటా సెంటర్ ప్రాజెక్టులను అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. చాలా జాబ్స్ వస్తాయని డేటా సెంటర్లు పెట్టినిస్తే చివరికి తాగటానికి గుక్కెడు నీళ్లు దొరకక ప్రజలు అమెరికాలో ఇబ్బందులు పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వాస్తవ పరిస్థితులను హైలైట్ చేస్తున్నాయి.
ALSO READ : డిసెంబర్లో మారనున్న క్రెడిట్ కార్డ్, పెన్షన్, ఇన్వెస్ట్మెంట్ రూల్స్..
డేటా సెంటర్ల కోసం పోటీ పడే బదులు ఏఐ అప్లికేషన్లు, ఫ్రంటియర్ ఏఐ మోడల్స్, భారతీయ భాషల కోసం తయారు చేసే టెక్నాలజీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సజిద్ చినోయ్, సిద్ధార్థ్ జవాద్ సిఫార్సు చేశారు. ఈ విభాగాలను బలోపేతం చేయడం వల్ల దేశానికి విస్తృత ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని వారు చెప్పారు.
