Health Alert: కొలెస్ట్రాల్ నార్మల్.. .. అయినా గుండెకు ముప్పు!

Health Alert: కొలెస్ట్రాల్ నార్మల్.. .. అయినా గుండెకు ముప్పు!

గుండె ఆరోగ్యం విషయంలో చాలామంది కొలెస్ట్రాల్ రిపోర్టునే ప్రామాణికంగా భావిస్తారు. కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణంగా ఉంటే గుండెకు ఎలాంటి ప్రమాదం లేదని అనుకోవడం, అశ్రద్ధ చేయడం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉన్నప్పటికీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారతీయుల్లో పాశ్చాత్య దేశాలతో పోలిస్తే తక్కువ వయసులోనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటోంది. అందుకే సాధారణ రక్త పరీక్షలతో పాటు గుండె ఆరోగ్యాన్ని మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు. గుండె ఆరోగ్యం పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుమానం ఉంటే చేయించు కోవాల్సిన టెస్టులు వంటి అంశాలను తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్ రిపోర్టు ఒక్కటే సరిపోదు

సాధారణంగా చేసే లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ ను చూపిస్తుంది. కానీ కొలెస్ట్రాల్‌ను మోసుకెళ్లే ప్రమాదకరమైన కణాల సంఖ్యను పూర్తిగా తెలియజేయదు. ఈ విషయాన్ని ApoB అనే రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు. బెంగళూరులోని రామయ్య మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ ఎస్. భట్ ఈ పరీక్ష ప్రాధాన్యతను వివరించారు.

రక్తనాళాల్లో వాపు కూడా ప్రమాదమే

అధిక ఒత్తిడి, పొగతాగడం, షుగర్ వ్యాధి, నిద్రలేమి వంటి కారణాలతో రక్తనాళాల్లో వాపు ఏర్పడవచ్చు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ వాపును hs-CRP పరీక్ష ద్వారా గుర్తించవచ్చంటున్నారు. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలట. Lp(a) అనే జన్యుపరమైన కొవ్వు కణం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు. దీనిని  ప్రత్యేక రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో గుండె ధమనుల్లో కాల్షియం పేరుకుపోవడం వల్ల కూడా గుండె పోటు రావచ్చంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో Coronary Artery Calcium (CAC) స్కాన్ ద్వారా గుండె రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోయిందా లేదా తెలుసుకోవచ్చంటున్నారు. 

ALSO READ : చలికి చర్మం పగులుతుందా..ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిగ నిగ మెరిసిపోద్ది..!

గుండెను భద్రంగాకాపాడుకోవాలంటే..

కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉందని నిర్లక్ష్యం చేయకూడదు. రక్తపోటు, షుగర్, ఫ్యామిలీ హిస్టరీ లైఫ్ స్టైల్ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. డాక్టర్ల సూచన మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. మంచి ఆహారం, రోజువారీ వ్యాయామం, తగినంత నిద్ర, ధూమపానానికి దూరంగా ఉండటం ద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చంటున్నారు డాక్టర్ సంజయ్ ఎస్. భట్.