చలికాలంలో నీరసంగా.. బద్ధకంగా అనిపిస్తుందా ? పొద్దున్నే ఈ పనులు చేస్తే ఫుల్ జోష్ !

 చలికాలంలో నీరసంగా.. బద్ధకంగా అనిపిస్తుందా ? పొద్దున్నే ఈ పనులు చేస్తే ఫుల్ జోష్ !

చలికాలం వచ్చిందంటే చాలు.. ఉదయాన్నే మంచం దిగాలనిపించదు. రోజంతా దుప్పటి కప్పుకుని పడుకోవాలనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా బద్ధకం, చిన్న విషయాలకే కోపం, చిరాకు, మనసులో ఏదో తెలియని బాధ! అయితే ఇదంతా సాధారణ బద్ధకం మాత్రమే కాకపోవచ్చు. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మన మానసిక స్థితిపై కూడా ప్రభావం పడవచ్చు. దీనినే వింటర్ బ్లూస్ అంటారు. మరి చలికాలంలో మనసును ఉత్సాహంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి ? నిపుణులు సూచించే కొన్ని సులభమైన అలవాట్లు మీకోసం..

చలికాలం చాలామందికి ఇష్టమైన సీజన్. చల్లటి వాతావరణం, వేడి వేడి టీ, కాఫీ, వెచ్చని దుస్తులతో హాయిగా గడపాలని అనిపిస్తుంది. కానీ కొందరికి మాత్రం ఇదే కాలం కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఉదయం నిద్రలేవాలనిపించదు. రోజంతా అలసటగా ఉంటుంది. ఏ పని మీదా ఆసక్తి చూపించలేరు. చిన్న విషయాలకే చిరాకు పడుతుంటారు. కొన్నిసార్లు కారణం లేకుండానే బాధగా అనిపిస్తుంది.

వాతావరణంలో వచ్చే మార్పులు మన శరీరంపైనే కాకుండా మనసుపై కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా చలికాలంలో పగటి సమయం తగ్గడం, సూర్యరశ్మి తక్కువగా అందడం వల్ల కొందరిలో మానసిక ఉత్సాహం తగ్గవచ్చు. ఇలా చలికాలంలో మూడ్ మారడం, నీరసంగా అనిపించడాన్ని వింటర్ బ్లూస్ అంటారు. అయితే ఈ సమస్యను పట్టించుకోకుండా వదిలేయకూడదు. మన ప్రతిరోజు అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే మానసిక ఉత్సాహాన్ని పెంచుకోవచ్చు....

రోజూ కాసేపు ఎండలో 
చలికాలంలో చాలామంది ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తారు. లేచిన తర్వాత కూడా చలి కారణంగా బయటకు వెళ్లడానికి ఇష్టపడరు. దీంతో రోజంతా ఇంట్లోనే గడిపేస్తుంటారు. ఫలితంగా సహజమైన సూర్యరశ్మి శరీరానికి తక్కువగా అందుతుంది. సూర్యరశ్మి మన శరీరంలోని బయోలాజికల్ క్లాక్ సిస్టమాటిక్ గా  ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు, సరైన వెలుతురు మానసిక స్థితిపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు ఎండలో గడపడానికి ప్రయత్నించండి. వీలైతే 15 నుంచి 20 నిమిషాలు బయట కూర్చోండి.

ఉదయాన్నే చిన్నపాటి వ్యాయామం 
చలికాలంలో వ్యాయామం చేయడానికి చాలామందికి బద్ధకం వేస్తుంది. కానీ రోజంతా చురుగ్గా ఉండాలంటే ఉదయం కొద్దిసేపు శారీరక శ్రమ చేయడం మంచిది. దీని కోసం గంటల తరబడి జిమ్‌లో గడపాల్సిన అవసరం లేదు. 10 నుంచి 15 నిమిషాల పాటు నడవడం, యోగా చేయడం లేదా చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం కూడా ఉపయోగపడతాయి. శరీరం చురుగ్గా ఉంటే మనసు కూడా ఉత్సాహంగా ఉంటుంది. కోపం, చిరాకు తగ్గించుకోవడానికి కూడా వ్యాయామం సహాయపడుతుంది.

 ఆకలి లేకపోయినా భోజనం 
మూడ్ బాగోలేనప్పుడు కొందరికి తినాలనిపించదు. మరికొందరు అలసటగా ఉందని వంట చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపరు. దీంతో భోజనం సమయానికి చేయకుండా వదిలేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల నీరసం, అలసట, చిరాకు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోండి. మీ ఆహారంలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు, ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోండి. వీలైతే మీకు ఇష్టమైన వంటకాలను మీరే తయారు చేసుకోండి. వంట చేయడం కూడా ఒక మంచి వృత్తిగా  మారి మనసుకు ఉత్సాహాన్ని ఇవ్వవచ్చు.

చలిగా ఉందని నీళ్లు తాగడం 
వేసవిలో దాహం ఎక్కువగా వేస్తుంది కాబట్టి చాలామంది ఎక్కువ నీళ్లు తాగుతారు. కానీ చలికాలంలో దాహం పెద్దగా అనిపించదు. దీంతో నీళ్లు తాగడం కూడా తగ్గించేస్తుంటారు. అయితే చలికాలంలోనూ శరీరానికి తగినంత నీరు అవసరం. నీరు తక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. దీనివల్ల అలసట, తలనొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే రోజంతా తగినంత నీరు తాగండి. సాధారణ నీరు తాగడం ఇబ్బందిగా అనిపిస్తే గోరువెచ్చని నీరు తీసుకోవచ్చు. నిమ్మకాయ, పుదీనా వంటి వాటితో తయారు చేసిన పానీయాలను కూడా తీసుకోవచ్చు.

మీకు నచ్చిన పనిలో కొంత సమయం
రోజూ ఒకే రకమైన పనులు చేస్తూ ఉంటే కొన్నిసార్లు జీవితం బోరింగ్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడం వల్ల ఈ భావన మరింత పెరగవచ్చు. అందుకే మీకు ఇష్టమైన పనులకు రోజులో కొంత సమయం కేటాయించండి. పుస్తకాలు చదవడం, పాటలు వినడం, పెయింటింగ్ వేయడం, మొక్కలు పెంచడం, వంట చేయడం.. ఇలా మీకు నచ్చిన ఏదైనా పనిని అలవాటు చేసుకోండి. ఇలాంటి అభిరుచులు మనసుకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి.

ఒంటరిగా ఉండకుండా స్నేహితులతో 
మూడ్ బాగోలేనప్పుడు కొందరు ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. బయటకు వెళ్లడం, స్నేహితులను కలవడం కూడా మానేస్తారు. కానీ ఎక్కువకాలం ఇలా ఒంటరిగా ఉండటం వల్ల బాధ, నిరాశ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే కుటుంబ సభ్యులు, స్నేహితులతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి. వారితో కలిసి బయటకు వెళ్లండి... సరదాగా మాట్లాడండి... ఏదైనా సమస్య ఉంటే మనసు విప్పి చెప్పండి. ప్రత్యక్షంగా కలవడం సాధ్యం కాకపోతే కనీసం ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా మాట్లాడండి. మనసుకు నచ్చిన వారితో కాసేపు మాట్లాడినా మూడ్‌లో మార్పు రావచ్చు.

వింటర్ బ్లూస్‌ను నిర్లక్ష్యం చేయకండి!
చలికాలంలో అప్పుడప్పుడు నీరసంగా అనిపించడం, బద్ధకం రావడం సాధారణమే. అయితే ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. ప్రతిరోజు పనులు చేసుకోలేకపోవడం, నిద్రలో మార్పులు, ఆకలి తగ్గడం,  బాధగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించాలి.

ఎందుకంటే కొందరిలో  సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD) అనే సీజనల్  మానసిక సమస్యకు సంబంధించిన లక్షణం కావచ్చు. అవసరాన్ని బట్టి వైద్యులు సరైన  చికిత్స సూచిస్తారు.

గుర్తుంచుకోండి.. చలికాలం వచ్చిందని రోజంతా దుప్పట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. కాసేపు ఎండలో గడపడం, చిన్నపాటి వ్యాయామం, మంచి ఆహారం, స్నేహితులతో సరదాగా మాట్లాడటం వంటి చిన్న చిన్న అలవాట్లతో మీ రోజును మరింత ఉత్సాహంగా మార్చుకోవచ్చు.