హిట్‎మ్యాన్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. ముంబై కెప్టెన్‎గా రోహిత్ రీ ఎంట్రీ

హిట్‎మ్యాన్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. ముంబై కెప్టెన్‎గా రోహిత్ రీ ఎంట్రీ

ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అభిమానులకు భారీ గుడ్ న్యూస్. ముంబై ఇండియన్స్ కెప్టెన్‎గా రోహిత్ శర్మ రీ అపాయింట్ అయ్యారు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ శుక్రవారం (నవంబర్ 27) ఈ విషయాన్ని అఫిషియల్‎గా ప్రకటించింది. ఐపీఎల్ 2027 సీజన్‎లో హిట్ మ్యాన్ ముంబైని ముందుండి నడిపించున్నట్లు తెలిపింది. హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ చేసిన నేపథ్యంలో రోహిత్‌కు ఎంఐ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. 

రోహిత్ శర్మ 2013 నుంచి 2024 వరకు 11 ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్ జట్టును నడిపించిన విషయం తెలిసిందే. హిట్ మ్యాన్ సారథ్యంలో ఎంఐ ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, 2024 సీజన్‌కు ముందు రోహిత్‎ను తొలగించి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించారు. ఈ నిర్ణయం బెడిసికొట్టింది. గడిచిన మూడు ఏళ్లలో ముంబై ప్రదర్శన దారుణంగా ఉంది. గత మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 

మైదానంలో జట్టు వైఫల్యాలు, కొన్ని వివాదాల నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ చేశారు. అందుకు బదులుగా పంజాబ్ నుంచి అర్ష్‌దీప్ సింగ్‌ను ముంబై జట్టులోకి తీసుకున్నారు. మళ్లీ కొత్త నాయకుడి కోసం వేట కొనసాగించిన మేనేజ్‌మెంట్ రోహిత్ వైపే మొగ్గు చూపింది. కెప్టెన్ రేసులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. 

కానీ, సూర్యకుమార్ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని, తిలక్ వర్మకు నాయకత్వ అనుభవం తక్కువని మేనేజ్‌మెంట్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కోచింగ్ స్టాఫ్ ను కూడా మేనేజ్మెంట్ ప్రక్షాళన చేసిన విషయం తెలిసిందే. జట్టు కొత్త హెడ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్ బాధ్యతలు చేపట్టనున్నారు. రోహిత్ శర్మ నాయకత్వంలో జట్టు మళ్లీ పుంజుకుంటుందని మేనేజ్‌మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది.