హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బేగం బజార్, రామ్ నగర్ ఫిష్ మార్కెట్లలో శుక్రవారం (నవంబర్ 27) తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. టీజీ సేఫ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆధ్వర్యంలో 19 ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, టీజీ సేఫ్ పోలీసులు, స్టేట్ ఫుడ్ ల్యాబ్ టెక్నీషియన్లు, జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు.
మొత్తం 19 చేపల విక్రయ కేంద్రాలు, పలువురు వీధి వ్యాపారుల దగ్గర తనిఖీలు నిర్వహించారు. అనేక దుకాణాలు FSSAI లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేకుండానే నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో చేపలను నిల్వ చేయడంతో పాటు విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. చేపల నిల్వకు ఉపయోగించే నీరు, ఐస్ నాణ్యతలో లోపాలు ఉన్నట్లు తేల్చారు. ఈ క్రమంలోనే ఆహార భద్రతా నిబంధనలు పాటించని పలువురు వ్యాపారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
రామ్ నగర్ ఫిష్ మార్కెట్లోని రెండు దుకాణాలకు అధికారులు క్లోజర్ నోటీసులు ఇచ్చారు. అక్కడ 40 కిలోల పాడైన చేపలను గుర్తించి పారేయించినట్లు టీజీ సేఫ్ వెల్లడించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
చేపల విక్రయ కేంద్రాల దగ్గర పరిశుభ్రత, నిల్వ పరిస్థితులు, ఇతర ఆహార భద్రతా ప్రమాణాలను అధికారులు పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇచ్చి, నిబంధనలు పాటించాలని ఆదేశించారు. వినియోగదారులకు సురక్షితమైన ఆహారం అందేలా చూడటమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని సంస్థ పేర్కొంది.
