డీలిమిటేషన్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ( నవంబర్ 27 ) డీలిమిటేషన్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన క్రమంలో ఈమేరకు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. నియోజకవర్గాల పునర్విభజన ఏపీకి చాలా మంచి అవకాశమని అన్నారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాదికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని... లోక్ సభ స్థానాలను 50 శాతం పెంచడం వల్ల అన్ని రాష్ట్రాలకు మేలు కలుగుతుందని అన్నారు సీఎం చంద్రబాబు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాలను సమానంగా 50 శాతం మేర పెంచే ప్రతిపాదన అత్యంత ఆమోదయోగ్యంగా ఉందని అన్నారు చంద్రబాబు. ఈ నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గకుండా ఉండటమే కాకుండా ఉత్తరాది సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకూ సమాన ప్రయోజనం చేకూరుతుందని.. ప్రాంతీయ అసమానతలకు తావుండదని అన్నారు చంద్రబాబు.
నవంబర్ 29 నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన ఎంపీలంతా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు చంద్రబాబు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీకి రావాలని తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా ఆహ్వానించారని అన్నారు.
