ముంబై: కేంద్రంలోని మోడీ సర్కార్ డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్న వేళ దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించిన పార్టీలు ఇప్పుడు తమ వైఖరిని మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు తమ షరతులు నెరవేరితే మద్దతు ఇస్తామని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ-ఎస్‌పీ సూచించింది. ఏ రాష్ట్రంలోనూ ప్రస్తుత ప్రాతినిధ్యాన్ని తగ్గించకుండా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను ఏకరీతిగా 50 శాతం పెంచాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది.
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ల అంశాన్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్‌సీపీ-ఎస్‌పీకి ఎనిమిది మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. వారందరూ సమావేశాలకు హాజరై పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలని ఆదేశిస్తూ జితేంద్ర అవ్హాద్ త్రీ-లైన్ విప్ జారీ చేశారు.
50 శాతం సీట్ల పెంపు డిమాండ్
రాష్ట్రాలవ్యాప్తంగా లోక్‌సభ సీట్లను ఏకరీతిగా 50 శాతం పెంచడాన్ని వ్యతిరేకించడం కష్టమని ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే పేర్కొన్నారు. అయితే, ప్రతిపాదిత చట్టంలో మహిళా రిజర్వేషన్‌ను కూడా చేర్చాలని ఆమె కోరారు. నియోజకవర్గాల సరిహద్దులను పునర్విభజన చేయడానికి ఉపయోగించే సూత్రంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు.
బేషరతు మద్దతు ప్రకటించలేదు
కేంద్రం సవరించిన బిల్లును పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రియా సూలే చెప్పారు. సమిష్టి నిర్ణయానికి రాకముందు ఇండియా కూటమి భాగస్వాములతో కూడా ఈ విషయంపై చర్చించాలని పార్టీ భావిస్తోంది. నిర్దిష్ట షరతులతో బిల్లుకు మద్దతు ఇవ్వడం అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో చేరడం కాదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.
లోక్‌సభ సీట్లు 50 శాతం మేర పెంచే సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2051 వరకు డీలిమిటేషన్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ మద్దతు ఇవ్వాలని భావించడం ఇండియా కూటమి ఐక్యతకు ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.
