ముంబైకి షాచ్చిన బుమ్రా.. వైస్ కెప్టెన్సీకి నో చెప్పిన స్టార్ పేసర్

ముంబైకి షాచ్చిన బుమ్రా.. వైస్ కెప్టెన్సీకి నో చెప్పిన స్టార్ పేసర్

ముంబై: 2027 ఐపీఎల్ సీజన్‎కు గాను ముంబై ఇండియన్స్ కెప్టెన్‎గా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నియమితులయ్యారు. హార్ధిక్ పాండ్యాను పంజాబ్ ట్రేడ్ చేసుకోవడంతో ఎంఐ సారథిగా హిట్‎మ్యాన్ మళ్లీ పగ్గాలు చేపట్టారు. అయితే, ముంబై కెప్టెన్సీ రేసులో సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, తిలక్ వర్మ పేర్లు వినిపించాయి. కానీ మేనేజ్మెంట్ మాత్రం రోహిత్ వైపే మొగ్గు చూపింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. స్టార్ పేసర్ బుమ్రాను కెప్టెన్‎గా పరిగణలోకి తీసుకోని ముంబై యాజమాన్యం.. రోహిత్‎కు డిప్యూటీగా వ్యవహారించాలని కోరింది. కానీ ఫ్రాంచైజీ ప్రపోజల్‎ను బుమ్రా సున్నితంగా తిరస్కరించారు. 

ముంబై వైస్ కెప్టెన్ పదవిని చేపట్టేందుకు అతడు అంగీకరించలేదు. 2026, అక్టోబర్ మొదటి వారంలోనే ముంబై యాజమాన్యం ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. జట్టు కొత్త సారథి ఎంపికలో టీ20 ప్రపంచ కప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ పేరును కూడా యాజమాన్యం పరిగణనలోకి తీసుకోలేదు. ఇక, తిలక్ వర్మ పేర్లను కూడా కెప్టెన్సీ పదవి కోసం పరిశీలించలేదు. తిలక్ వర్మ ఇంకా నేర్చుకునే దశలో ఉన్న ఆటగాడని యాజమాన్యం భావిస్తోంది. 

ముంబై ఇండియన్స్ టీమ్‌లో బుమ్రా అత్యంత కీలక ఆటగాడిగా కొనసాగుతున్నారు. 19 ఏళ్ల వయసులో 2013లో జట్టులోకి వచ్చిన ఆయన, ఇప్పటివరకు 14 ఐపీఎల్ సీజన్లలో 187 వికెట్లు తీశారు. 2025 మెగా వేలంలో బుమ్రాను రూ.18 కోట్లకు ఫ్రాంచైజీ అట్టిపెట్టుకుంది. డిసెంబర్‌లో 32 ఏళ్లు పూర్తి చేసుకోనున్న బుమ్రాకు ఇది కెప్టెన్ అయ్యే చివరి అవకాశమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ యాజమాన్యం ఆయనను నాయకత్వ బాధ్యతలకు ఎంపిక చేయకపోవడంతో 2028 మెగా వేలం నాటికి బుమ్రా తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.