ముంబై: దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోన్న డీలిమిటేషన్ బిల్లు ప్రతిపక్ష ఇండీ కూటమిలో చిచ్చురేపింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఇండీ కూటమిలోని పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన పార్టీలు తమ స్టాండ్ మార్చుకుని కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో డీలిమిటేషన్‌కు మద్దతు తెలపాలని ఎన్సీపీ (ఎస్పీ) తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ ఫైర్ అయ్యింది. ఇండియా కూటమి పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తుంటే ఎన్సీపీ ఎందుకు మద్దతు ఇస్తోందని ప్రశ్నించింది.
2026 మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో శరద్ పవార్ గెలుపు కోసం తాము సీటును త్యాగం చేశామని గుర్తు చేసింది. రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎన్సీపీ (ఎస్పీ)కి కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని.. ఆ సమయంలో సుప్రియా సూలే స్వయంగా కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి మద్దతు కోరారని తెలిపింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఏమాత్రం ఆలోచించకుండానే పవార్‌కు మద్దతు ఇచ్చారని గుర్తు చేసింది. అప్పుడు తాము తమ సొంత సీటును వదులుకుని శరద్ పవార్ గెలుపునకు సహకరించామని పేర్కొంది. ఇప్పుడు అదే ఎన్సీపీ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై ఏంటని అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇందుకోసమేనా మేం మా సీటును త్యాగం చేసిందని నిలదీసింది.
ఎన్సీపీ ఎస్పీ వాదన ఇలా..
డీలిమిటేషన్ ప్రక్రియ రాజ్యాంగపరమైన అవసరమని ఎన్సీపీ (ఎస్పీ) నేత జితేంద్ర అవ్హాడ్ తెలిపారు. శరద్ పవార్‌తో చర్చించిన తర్వాతే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంలో తాము కేంద్రానికి మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదని ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే అభిప్రాయపడ్డారు. దేశానికి మేలు చేసే అంశాలు ఇందులో ఉండవచ్చని, నిబంధనలను పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని ఆమె అన్నారు. ప్రతిపక్షాలు గుడ్డిగా వ్యతిరేకించకుండా నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరారు.
సుప్రియా సూలేకు కేంద్ర మంత్రి పదవి..!
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిచ్చి ఇండియా కూటమి నుంచి ఎన్డీయే వైపు మళ్లుతున్నందుకు ప్రతిఫలంగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) కేంద్రంలో, మహారాష్ట్రలో అధికారంలో వాటా కోసం బేరమాడుతోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలేకు మోదీ కేబినెట్లో బెర్త్ ఇవ్వాలని పార్టీ పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ రెండు కేబినెట్ బెర్తులు (జయంత్ పాటిల్‌కు ఆర్థిక శాఖ, జితేంద్ర ఆవ్హాడ్కు మరో శాఖ), రెండు సహాయ మంత్రి పదవులు కోరుతోందని సమాచారం. సుప్రియాను మహారాష్ట్ర సీఎం చేయాలని పవార్ కోరుతున్నారనే వార్తలను ఆమె కొట్టిపారేశారు. ఈ నెల 30న సభలో ఓటింగ్‌కు ముందే ఒప్పందం ఖరారు చేసేందుకు తెరవెనుక చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఇండియా కూటమి మీటింగ్‌కు వెళ్లను: సుప్రియా
అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ పవార్ ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వానికి ఫోన్ చేసి, పార్టీ చీలిపోకుండా ఉండాలంటే బిల్లుకు మద్దతివ్వడం తప్పనిసరని చెప్పినట్లు తెలిసింది. సోమవారం నేరుగా ఢిల్లీకి వెళ్తానని ప్రకటించిన సుప్రియా, శనివారం జరిగే ఇండియా కూటమి భేటీకి హాజరుకావడం లేదు.
