వెలుగు స్పెషల్ : కేరళ, తమిళనాడు తరహా.. తెలంగాణలోనూ ప్రజా పంపిణీ వ్యవస్థ తేవాలి

వెలుగు స్పెషల్ : కేరళ, తమిళనాడు తరహా.. తెలంగాణలోనూ  ప్రజా పంపిణీ వ్యవస్థ తేవాలి

ఇప్పటికే పశ్చిమ ఆసియాలో  సంక్షోభం వల్ల ఇంధన సంక్షోభంతో పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి.  దీంతో సామాన్యుడు వంటిల్లు బడ్జెట్ అసాధారణంగా పెరిగిపోయింది.  ప్రజలు అత్యధికంగా వినియోగించే సన్నరకం బియ్యం బహిరంగ మార్కెట్లో 80 రూపాయలకు పైగా చేరింది. 

పేదలకు అందుబాటులో ఉండే, ఎక్కువగా వినియోగించే కోడిగుడ్డు సైతం ఎనిమిది రూపాయలు పైగానే ఉంది. తల్లి చేయని సాయం చేసే ఉల్లి కూడా కొండెక్కింది.కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2026 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దేశ రిటైల్  ద్రవ్యోల్బణం 6.9% కాగా అది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6.55గా నమోదయింది.  

ఒక నెలలోనే 0. 55 పాయింట్లు పెరిగింది. ఇక ఆహార  ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7.74 ఉండగా అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సుమారుగా తొమ్మిదికి చేరింది. అంటే 1.26 పాయింట్లు పెరుగుదల నమోదయింది. తెలంగాణ  ద్రవ్యోల్బణం సైతం 7.26గా నమోదయింది.  

ఆహార ద్రవ్యోల్బణం11.6%గా ఉంది.   దేశంలో 80 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోధుమలు ఇప్పటికీ అందుతున్నాయి అంటే  ఎనిమిది దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో పేదరికం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. సంవత్సరంలో 360 రోజులకు పనులు దొరకడం లేదు. దొరికిన అరకొర పనులకు రోజుకు రూ.500 కూడా సంపాదించుకోలేని కుటుంబాల సంఖ్య అధికంగా ఉంది. 

స్థిరమైన ఉపాధి, ఉద్యోగ జీతభత్యాలు లేని కుటుంబాలను ఈ ధరల  పెరుగుదల వేధిస్తున్నది. పంటల దిగుబడి లేక కరువు ప్రభావం, సరఫరా వ్యవస్థలో ఒత్తిడి కారణంగా ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  

అక్రమ నిల్వలతో కృత్రిమ కొరత

దేశంలో  మాల్స్ వ్యాపారుల అక్రమ నిల్వలతో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.  రేట్లు పెంచి ప్రజలను దోచుకుంటున్నారు. మార్కెట్ శక్తులను నియంత్రించే విషయంలో పాలకులు ఎవరైనా, అమలు జరుగుతున్న విధానం మార్కెట్ శక్తులకు లాభం చేకూరేలా ఉంటుంది.  

దీంతో ధరల పెరుగుదల నియంత్రణలోకి రావడం లేదు.  ప్రభుత్వాలకు రైతుల, వినియోగదారుల ప్రయోజనాలే ప్రధానం కావాలి. కానీ ప్రభుత్వాలు మార్కెట్ శక్తుల లాభమే ఏకైక లక్ష్యంగా ఉంటున్నాయి.  ఆహార వస్తువుల అక్రమ నిలువ, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.  

ప్రజా పంపిణీ వ్యవస్థను  బలోపేతం చేసి ప్రజలను ఆదుకోవాల్సిన పాలకులు దీనిపై పూర్తి నిర్లక్ష్యం వహించడం కారణంగా ప్రైవేటు వ్యాపారులకు లాభంగా మారింది. దేశంలో తమిళనాడు, కేరళలో ప్రజా పంపిణీ వ్యవస్థ  ఉన్నదాంట్లో మెరుగ్గా నడుస్తున్నది. ఆ రెండు రాష్ట్రాలలో 13 రకాల నిత్యావసర సరుకులు ప్రజలకు అందిస్తున్నారు. మరికొన్ని సరుకులను సబ్సిడీతో మధ్యతరగతి వారికి సైతం అందిస్తున్నారు. వాటి ధరలు బహిరంగ మార్కెట్లో ఉన్నవాటి కన్నా 30% తక్కువగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్నాయి. 

ప్రభుత్వం ధరలను నియంత్రించాలి

సామాన్య  ప్రజలకు  స్థిరమైన ఆదాయాలు, ఉద్యోగ, ఉపాధి వేతనాలు లేవు.  వీటిని కల్పించడం కోసం పాలకులు ఆలోచించట్లేదు. సామాజిక భద్రతా పథకాలను ఓట్ల పథకాలుగా మార్చారు.  ప్రజా సంక్షేమాన్నీ, ఆహార భద్రతను  సైతం మార్కెట్ శక్తులకు పాలకులు వదిలేశారు.   ధరల నియంత్రణకు ఉత్పత్తి, సరపరా,  నిల్వల విషయంలో జరుగుతున్న తేడాలను ప్రభుత్వం పరిష్కరించాలి,  ధరల వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నియంత్రించాలి. 

 రైతు బజార్లలో  ప్రజలకు అవసరమైన సరుకులను అందుబాటులో ఉంచి సబ్సిడీతో అందజేయాలి. వ్యాపారులు,  వినియోగదారుల మధ్య ప్రభుత్వం వ్యాపార ప్రయోజనాల కోసం కాకుండా, ఉత్పత్తిదారుడు, వినియోగదారుల ప్రయోజనాల కోసం చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలి. అలా చేయకపోతే ఓ పక్క ఆదాయం లేక మరోపక్క తిండిలేక దేశ ప్రజలు ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణలోనూ కేరళ, తమిళనాడు తరహా ప్రజాపంపిణీ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 

- ఆవుల అశోక్,సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్,రాష్ట్ర కమిటీ సభ్యుడు-

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.