డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం..నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం : డీజీపీ పీవీ ఆనంద్

డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం..నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం : డీజీపీ పీవీ ఆనంద్

కామారెడ్డిటౌన్, వెలుగు : డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్​ అధికారులకు సూచించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో డీజీపీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లాలోని పోలీసు అధికారులతో పోలీస్ స్టేషన్ల వారీగా మాట్లాడారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి ‘నషా ముక్త్ భారత్’కు పిలుపునిచ్చారని గుర్తుచేశారు. డ్రగ్స్ నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ల కిందట ‘ఈగల్’ టీమ్ ఏర్పాటు చేసిందని తెలిపారు. నార్కోటిక్, ఈగల్ టీమ్ కలిసి పనిచేస్తూ డ్రగ్స్‌‌ను అరికడతాయని, సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించామని, ప్రస్తుతం ముగ్గురు మాత్రమే నక్సలైట్ నేతలు ఉన్నారన్నారు. కొత్త జిల్లాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనల్లో ఉన్నాయని తెలిపారు. పోలీసు శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 

పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరతపై స్థానికంగా సర్దుబాటు చేసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు 300 మందితో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు, కౌన్సెలింగ్‌‌లు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో తాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేశానని, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పారు. కామారెడ్డి జిల్లా పోలీసుల పనితీరు బాగుందని అభినందించారు. ఈ సమావేశంలో మల్టిజోన్​1 ఐజీ కార్తికేయ,  జోన్​3 ఇన్​చార్జి డీఐజీ సన్​ప్రీత్​సింగ్,  సీఐడీ డీఐజీ నారాయణ నాయక్​, జిల్లా ఎస్సీ రాజేశ్​చంద్ర, సీఐడీ, సైబర్​ సెక్యురిటీ, ఈగల్​ ఫోర్స్​ ఎస్పీలు  ప్రవీన్​కుమార్, హార్షవర్ధన్, ఆర్.గిరిధర్​పాల్గొన్నారు. కాగా, డీజీపీని కలెక్టర్​ఆశిష్​సంగ్వాన్​ కలిశారు.