మెదక్, వెలుగు : కాకి లెక్కలు చొప్పొద్దని మెదక్ ఎంపీ రఘునందన్ రావు బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఎంత మంది రైతుకు క్రాప్లోన్లు ఇచ్చారు, ఎంఎస్ఎంఈ కింద ఎంత మందికి ఆర్థిక సహాయం మంజూరు చేశారని ప్రశ్నించారు. బ్యాంకర్ల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో సమాచారం లేకుండా మీటింగ్ కు ఎందుకొచ్చారని మండిపడ్డారు.
తాను ఎంపీ అయ్యాక రెండున్నరేండ్ల వరకు లీడ్ బ్యాంక్మేనేజర్ కలవలేదని, ఇక రైతులకు ఎక్కడ కలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్ లో బ్యాంకర్లతో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశానికి ఎంపీ హాజరయ్యారు. కలెక్టర్ ప్రతిమా సింగ్, అడిషనల్ కలెక్టర్ నగేశ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, మేనేజర్లతో కలిసి జిల్లాలో బ్యాంకింగ్ సేవలు, రుణాల మంజూరు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై సమీక్షించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో క్రాప్ లోన్ లు ఎంత మందికి ఇచ్చారని అడిగితే ఏ బ్యాంక్ మేనేజరు కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో ఎంపీ బ్యాంకర్ల తీరుపై మండిపడ్డారు.
కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నామంటూ పాత లెక్కలతో కాలం వెళ్లదీస్తే కుదరదన్నారు. రామాయంపేట మండలం కోనాపూర్ పీఏసీఎస్ లో గత ప్రభుత్వంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే అక్రమాలకు పాల్పడ్డ వారిపై ఇంత వరకు చర్యలెందుకు లేవని, ఎక్వైరీ పూర్తికి ఇంకా ఎన్నేండ్లు పడుతుందని ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లులేని కబోదిలా మాట్లాడుతున్నారన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో ‘దుష్ట చతుష్టయం’ అన్న సీఎం వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. వాళ్లు నిజంగా దుష్ట చతుష్టయం అయితే నెలకొకసారి ఢిల్లీకి వెళ్లి వంగి వంగి ఎందుకు దండాలు పెడుతున్నారని ప్రశ్నించారు.
