హైదరాబాద్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీల గ్రేడింగ్ అంశాన్ని త్వరలోనే పూర్తిచేస్తామని పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, కమిషనర్ దివ్య దేవరాజన్ హామీ ఇచ్చారు.
టీజీఈజేఏసీ చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం నేతలు శుక్రవారం స్పెషల్ సీఎస్ ఛాంబర్లో అధికారులను కలిశారు. ఈ సందర్భంగా జీపీ గ్రేడింగ్ ఫైల్‌ను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపినందుకు కమిషనర్ దివ్య దేవరాజన్‌కు నేతలు ధన్యవాదాలు తెలిపారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నుంచి గ్రేడ్–4 కార్యదర్శులుగా రెగ్యులర్ అయినవారి నాలుగేండ్ల సర్వీస్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుని దాదాపు 9 వేల మంది కార్యదర్శుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. అధికారులను కలిసిన వారిలో పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బలరాం, కార్యదర్శి వెంకటరమణ, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రవణ్ తదితరులున్నారు.
