- మృతదేహాన్ని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు
వరంగల్ సిటీ, వెలుగు : గ్రేటర్ వరంగల్‌లో దారుణ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి మృతదేహాన్ని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్‌లోని పుప్పాలగుట్టకు చెందిన విక్రమ్ (35) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన సందీప్ విక్రమ్‌కు స్నేహితుడు. వీరిద్దరూ డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త, మట్టిలో కలిసిన బంగారాన్ని సేకరిస్తుంటారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం నుంచి ఇద్దరూ కలిసి మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, తలకు గాయమైన విక్రమ్‌ను సందీప్ ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ కరుణాకర్ తెలిపారు.
