- 16 కేసులు నమోదు, 102 ప్రామిసరీ నోట్లు, 63 ఖాళీ చెక్ బుక్స్ స్వాధీనం
మంచిర్యాల, వెలుగు: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అధిక వడ్డీలకు అప్పులిస్తూ, అక్రమ చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు కొరడా ఝళిపించారు. ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లావ్యాప్తంగా 57 ఇళ్లలో పోలీసులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆసిఫాబాద్ డీఎస్పీ బి.అశోక్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి.
ఈ సోదాల్లో మొత్తం 16 కేసులు నమోదు చేసిన పోలీసులు 102 ప్రామిసరీ నోట్లు, 63 ఖాళీ చెక్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజలు, రైతులను ఆర్థికంగా వేధించడం, బెదిరింపులకు పాల్పడటం, చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించడాన్ని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే వెంటనే సమీప పీఎస్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులకు పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
