బొజ్జ చెట్ల నరికివేతపై చర్యలు..నాలుగు కేసులు నమోదు

బొజ్జ చెట్ల నరికివేతపై చర్యలు..నాలుగు కేసులు నమోదు

మంచిర్యాల, వెలుగు: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట రేంజ్ పరిధిలో బొజ్జ చెట్ల నరికివేతపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేశామని ఎఫ్ఆర్వో అనిల్ కుమార్ తెలిపారు. బొజ్జ చెట్లను నరికివేస్తూ, లక్క అక్రమ వ్యాపారంతో సొమ్ము చేసుకుంటున్న వ్యక్తులపై ప్రత్యేక గస్తీ బృందాలను ఏర్పాటు చేసి నిర్వహించిన వరుస దాడుల్లో 4 ముఠాలను పట్టుకున్నామన్నారు.

 ఈ నాలుగు కేసుల్లో మొత్తం ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. వీరిలో అగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ నుంచి నలుగురు, గుండెపల్లి, కమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గావ్, మురళీగూడ, జిల్లెడ గ్రామాల నుంచి మరో నలుగురు ఉన్నారని పేర్కొన్నారు. 

వీరంతా సమీప అటవీ ప్రాంతాల్లో అక్రమంగా లక్కను సేకరించి, ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్రకు తరలించి విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఇందులో ప్రమేయం ఉన్న మరికొంతమంది వ్యక్తుల పేర్లను బహిర్గతం చేస్తామని తెలిపారు.