న్యూఢిల్లీ: జైలు నుంచే లోక్‌సభ ఎంపీగా గెలిచిన ‘అకాలీదళ్ (వారిస్ పంజాబ్ దే)’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. మూడేళ్లుగా అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నప్పటికీ, ఆయన రెండు స్థానాల్లో పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తన పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా ఉన్న 33 ఏళ్ల అమృత్‌పాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘ధురి’ నియోజకవర్గంతో పాటు తన సొంత ఖదూర్ సాహిబ్ లోక్‌సభ పరిధిలోని ‘ఖేమ్ కరణ్’ నుంచి పోటీ చేయనున్నారు.
అధికార ఆప్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగేందుకే నేరుగా సీఎంను ఢీకొట్టాలని భావిస్తున్నారు. 2023 ఏప్రిల్‌లో అరెస్టయిన ఆయనపై అజ్నాలా పీఎస్‌పై దాడి, ఆయుధాల కేసు, ఓ సిక్కు కార్యకర్త హత్య అభియోగాలు ఉన్నాయి. ఇటీవల నాయనమ్మ అంత్యక్రియలకు 3 గంటల పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడు ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆరేళ్ల క్రితం విడిపోయిన బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) తిరిగి జతకట్టడంతో పోటీ రసవత్తరంగా మారింది. మరోవైపు అమృత్‌పాల్ తండ్రి క్షేత్రస్థాయిలో పార్టీని నడిపిస్తూ, ప్రత్యామ్నాయ కూటమి కోసం కొన్ని అకాలీదళ్ వర్గాలు, బీఎస్పీతో చర్చలు జరుపుతున్నారు.
