వెలుగు స్పెషల్ : ఫూలే కల అసంపూర్ణమే.. సమాజంలో రూపం మారుతున్న కులాధిపత్యం

వెలుగు స్పెషల్ : ఫూలే కల అసంపూర్ణమే.. సమాజంలో రూపం మారుతున్న కులాధిపత్యం

మహాత్మా జ్యోతిరావు ఫూలే మరణించి 136 సంవత్సరాలు గడిచాయి. 1890 నవంబర్ 28న ఆయన కన్నుమూశారు. కాలం మారింది, పాలనా వ్యవస్థలు మారాయి, రాజ్యాంగం సమానత్వపు హక్కులను ప్రకటించింది. 

విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పించే విధానాలు అమలులోకి వచ్చాయి. అయినప్పటికీ, భారత సమాజాన్ని శతాబ్దాలుగా నియంత్రిస్తున్న కులాధిపత్యం తన రూపాన్ని మార్చుకుంటూ కొనసాగుతోంది. ఈ వాస్తవం ఫూలే జీవితాన్ని స్మరించుకునే సందర్భంలో ఒక కీలకమైన ప్రశ్నను ముందుకు తెస్తుంది. 

కుల వ్యవస్థను ప్రశ్నించిన ఫూలే ఆలోచనలు మనకు వారసత్వంగా మిగిలాయా? లేక ఆయన పోరాడిన సామాజిక ఆధిపత్యం కొత్త రూపాల్లో మన సమాజాన్ని ఇంకా నడిపిస్తోందా? ఫూలేను జయంతులు, వర్ధంతులకే పరిమితం చేయడం ఆయన ఆలోచనా విప్లవాన్ని చరిత్రలో బంధించడమే. ఆయన జీవితం ఒక వ్యక్తి సంస్కరణల కథ కాదు.

 జ్ఞానం, అధికారం, శ్రమ, గౌరవం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైన సమాజాన్ని ప్రజలు ప్రశ్నించే శక్తితో మార్చాలన్న ప్రయత్నం. అందుకే ఫూలేను అర్థం చేసుకోవడం అంటే, నేటి సమాజంలో కొనసాగుతున్న అసమానతల మూలాలను గుర్తించి వాటిని ఎదుర్కొనే రాజకీయ దృక్పథాన్ని నిర్మించుకోవడం. జ్ఞానాన్ని కొద్దిమంది వర్గాల హక్కుగా మార్చి, మిగిలిన ప్రజలను అజ్ఞానంలో ఉంచడం ద్వారా సామాజిక ఆధిపత్యాన్ని తరతరాలుగా కొనసాగించింది. 

ఈ నిర్మాణాన్ని జ్యోతిరావు ఫూలే సవాలు చేశారు. విద్యను దయతో ఇచ్చే అవకాశంగా కాకుండా,  ప్రజలకు నిరాకరించిన హక్కుగా చూశారు.  ఎవరు జ్ఞానాన్ని పొందాలి,  ఎవరు ఆలోచించాలి,  ఎవరు సమాజాన్ని  ప్రశ్నించాలనే నిర్ణయాన్ని ఆధిపత్య వర్గాల నుంచి ప్రజల చేతుల్లోకి తీసుకువచ్చేందుకు  స్ఫూ ర్తి ప్రదాతగా ఫూలే నిలిచారు.

- పాపని నాగరాజు -

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.